Telangana: తెలంగాణలోని మద్యం ప్రియులకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద షాక్ ఇవ్వబోతోంది. రాష్ట్రంలో అన్ని రకాల మద్యం ధరలను భారీగా పెంచేందుకు అడుగులు పడుతున్నాయి. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ముగిసిన తర్వాత, ఏ క్షణమైనా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ పెంపుతో సాధారణ మద్యం నుంచి ప్రీమియం బ్రాండ్లు, అలాగే బీర్ల ధరలు కూడా ప్రియం కానున్నాయి.
ధరల పెంపునకు అసలు కారణాలు ఇవే:
మద్యం రేట్లు పెంచాలంటూ తయారీ కంపెనీల నుంచి ప్రభుత్వంపై గత కొంతకాలంగా తీవ్ర ఒత్తిడి వస్తోంది. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ వాతావరణం వల్ల గ్లాస్ బాటిల్స్ ధరలు పెరిగాయని కంపెనీలు చెబుతున్నాయి. దీనికి తోడు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు కూడా వెయ్యి రూపాయలకు పైగా పెరగడంతో, మద్యం తయారీ ఖర్చు 15 నుంచి 20 శాతం వరకు ఎక్కువైందని.. ధరలు పెంచకపోతే తాము నష్టపోతామని కంపెనీలు ప్రభుత్వానికి విన్నవించాయి.
ఎంత శాతం పెరిగే అవకాశం ఉంది?
మద్యం ధరల అంచనా కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ గతంలో ఒక ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ పొరుగు రాష్ట్రాల్లోని ధరలను పరిశీలించి, తెలంగాణలో కూడా 25 నుంచి 30 శాతం వరకు రేట్లు పెంచవచ్చని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. అయితే, ఒకేసారి అంత మొత్తంలో పెంచితే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని భావించిన ప్రభుత్వం.. మధ్యేమార్గంగా 10 నుంచి 15 శాతం వరకు ధరలను పెంచేందుకు మొగ్గు చూపినట్లు సమాచారం.
రేవంత్ సర్కార్‌లో ఇదే మొదటిసారి:
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు రాష్ట్రంలో మద్యం ధరలను పెంచలేదు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ప్రస్తుతం తెలంగాణలో మద్యం ధరలు కాస్త తక్కువగానే ఉన్నాయి. ఇప్పుడు తొలిసారిగా రేట్లను పెంచి, అటు కంపెనీల ఒత్తిడిని తగ్గించడంతో పాటు.. ఇటు ప్రభుత్వ ఖజానాకు కూడా అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోవాలని సర్కార్ భావిస్తోంది. జూన్ మొదటి వారంలోనే ఈ కొత్త ధరలు అమలులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
