Inder kaur: మహిళలపై రోజురోజుకూ దారుణాలు పెరిగిపోతున్నాయి. సమాజంలో ఎన్ని కఠిన చట్టాలు వస్తున్నా.. ఉన్మాదుల ఆగడాలకు అడ్డుకట్ట పడటం లేదు. తాజాగా పంజాబ్‌లో ఇటువంటి ఘోరమైన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ప్రముఖ పంజాబీ గాయని ఇందర్ కౌర్ అత్యంత దారుణంగా హత్యకు గురైంది. తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చిన వ్యక్తికి నిరాకరించిందనే కోపంతో, ఓ ఉన్మాది ఆమెను ప్రాణాలతో మట్టుబెట్టి శవాన్ని కాలువలో పడేశాడు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మోగా ప్రాంతంలోని భలూర్ గ్రామానికి చెందిన సుఖ్వీందర్ సింగ్ అనే వ్యక్తి గత కొంతకాలంగా గాయని ఇందర్ కౌర్‌ను పెళ్లి చేసుకోవాలంటూ తీవ్రంగా వేధిస్తున్నాడు. అయితే ఆమె అందుకు అస్సలు ఒప్పుకోలేదు. దీంతో ఇందర్ కౌర్‌పై సుఖ్వీందర్ సింగ్ పగ పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే మే 13వ తేదీ రాత్రి గం. 8:30 ప్రాంతంలో ఇందర్ కౌర్ కొన్ని వస్తువులు తీసుకురావడానికి కారులో బయటకు వెళ్లింది. రాత్రి ఎంతైనా ఆమె ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసుల దర్యాప్తులో ఇందర్ కౌర్ దారుణ హత్యకు గురైనట్లు తేలింది. కెనడా నుంచి పంజాబ్‌కు వచ్చిన సుఖ్వీందర్ సింగ్, తన స్నేహితుడు కరమ్‌జిత్ సింగ్‌తో కలిసి ఇందర్ కౌర్‌ను అపహరించి, హతమార్చాడు. అనంతరం సాక్ష్యాలను మాయం చేయడానికి ఆమె మృతదేహాన్ని ఒక కాలువలో పడేసి, వెంటనే కెనడాకు పారిపోయాడు. కాలువలో దొరికిన ఇందర్ కౌర్ శవాన్ని చూసి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.
అయితే ఈ ఘటనపై పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మే 15నే సుఖ్వీందర్ సింగ్, కరమ్‌జిత్ సింగ్‌లపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటికీ.. పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే తమ కుమార్తె ప్రాణాలతో ఉండేదని వారు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ విషయంపై జమాల్పూర్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ బల్బీర్ సింగ్ మాట్లాడుతూ.. కేసు నమోదు చేశామని, ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయని తెలిపారు.
