Health Tips: దేశవ్యాప్తంగా ఇళ్లలో దోమలను నివారించడానికి ఉపయోగించే దోమల అగరబత్తులు (Mosquito Agarbattis) ఇంకా ఇతర నివారణ ఉత్పత్తుల భద్రతపై ‘హోమ్ ఇన్సెక్ట్ కంట్రోల్ అసోసియేషన్’ (HICA) నిర్వహించిన తాజా సర్వేలో పలు ఆందోళనకరమైన విషయాలు వెల్లడయ్యాయి. జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని పురస్కరించుకుని విడుదల చేసిన ఈ దేశవ్యాప్త నివేదిక ప్రకారం.. భారతీయ మార్కెట్లో లభిస్తున్న సుమారు 85 శాతం దోమల అగరబత్తులు ఎలాంటి ప్రభుత్వ అనుమతులు, నాణ్యతా ప్రమాణాలు లేని నకిలీ అలాగే చట్టవిరుద్ధమైన ఉత్పత్తులేనని తేలింది. ఇవి దోమల కంటే ఎక్కువగా మనుషుల ప్రాణాలకే ముప్పుగా మారుతున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
సిగరెట్ పొగతో సమానం!
మార్కెట్ రీసెర్చ్ సంస్థ ‘కాంతార్’ సహాయంతో దేశంలోని 12 ముఖ్య నగరాల్లోని 1,264 కుటుంబాలు మరియు 405 మంది వైద్యుల (శ్వాసకోశ నిపుణులు, పిల్లల వైద్యులు) అభిప్రాయాల ఆధారంగా ఈ సర్వేను రూపొందించారు. ఈ నివేదికలో పాల్గొన్న సుమారు 67 శాతం మంది డాక్టర్లు.. ఈ నకిలీ అగరబత్తుల నుండి వచ్చే పొగ వల్ల కలిగే ఆరోగ్య నష్టాలు, సిగరెట్ పొగ తాగడం వల్ల వచ్చే నష్టాలతో సమానమని స్పష్టం చేశారు. ఈ అక్రమ ఉత్పత్తులలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ‘సెంట్రల్ ఇన్సెక్టిసైడ్స్ రిజిస్ట్రేషన్’ (CIR) అనుమతులు ఉండటం లేదు. అంతేకాకుండా, వాటిలో ఏయే రసాయనాలు వాడుతున్నారనే కనీస సమాచారాన్ని కూడా ప్యాకెట్లపై ముద్రించడం లేదు.
‘హెర్బల్’ పేరుతో జరుగుతున్న మోసం
సాధారణంగా ప్రజలు మెడికల్ షాపుల్లో లేదా కిరాణా దుకాణాల్లో దొరికే ఏ ప్రొడక్ట్ అయినా సురక్షితమేనని భావిస్తుంటారు. సర్వే ప్రకారం 48 శాతం మంది వినియోగదారులు ఇదే భ్రమలో ఉన్నారు. అలాగే 50 శాతం మంది ప్రజలు ‘హెర్బల్’ (Herbal) లేదా వేప, సిట్రోనెల్లా ఆధారిత అగరబత్తులు ఆరోగ్యానికి మంచివని నమ్ముతున్నారు. కానీ, ఇవన్నీ కేవలం అమ్మకాలను పెంచుకోవడానికి కంపెనీలు చేసే తప్పుడు ప్రకటనలని, వీటిలో ఊపిరితిత్తులకు తీవ్ర హాని చేసే ప్రమాదకరమైన విషపూరిత రసాయనాలు (Heavy metals) ఉంటాయని 66 శాతం మంది నిపుణులు హెచ్చరించారు.
పెరుగుతున్న వైద్య ఖర్చులు
దేశంలో ఈ మస్కిటో అగరబత్తుల మార్కెట్ దాదాపు ₹2,000 కోట్లకు పైగా ఉంది. ఇందులో సింహభాగం నకిలీ కంపెనీలే ఏలుతున్నాయి. దాదాపు 59 శాతం ఇళ్లలో ఈ ఉత్పత్తులను వాడుతుండగా, అందులో సగం మంది గత మూడేళ్లుగా ప్రతిరోజూ వీటిని వెలిగిస్తున్నారు. ఈ పొగను నిరంతరం పీల్చడం వల్ల కుటుంబాలలో శ్వాసకోశ సమస్యలు, ఆస్తమా, కళ్ల మంటలు మరియు అలర్జీలు పెరుగుతున్నాయని, ఫలితంగా దాదాపు 84 శాతం ఇళ్లలో వైద్య ఖర్చులు (Healthcare costs) విపరీతంగా పెరిగిపోతున్నాయని సర్వే వెల్లడించింది.
