PBKS vs DC:

PBKS vs DC: పంజాబ్ కింగ్స్‌కు షాకిచ్చిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో ఘనవిజయం!

PBKS vs DC: హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాల వేదికగా జరిగిన ఐపీఎల్ 2026, 55వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (DC) అద్భుత విజయాన్ని అందుకుంది. పంజాబ్ కింగ్స్ (PBKS) నిర్దేశించిన 211 పరుగుల భారీ లక్ష్యాన్ని ఢిల్లీ మరో ఓవర్ మిగిలి ఉండగానే ఛేదించింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో అక్షర్ పటేల్, డేవిడ్ మిల్లర్ మెరుపు అర్ధశతకాలతో జట్టును ఆదుకోగా, చివర్లో యువ ఆటగాళ్లు విధ్వంసం సృష్టించి విజయాన్ని ఖాయం చేశారు.

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (59 నాటౌట్), ప్రియాన్ష్ ఆర్య (56) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ స్టార్క్, మాధవ్ తివారీ తలో రెండు వికెట్లు పడగొట్టారు.

కష్టాల్లో ఢిల్లీ.. ఆదుకున్న సీనియర్లు

211 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీకి ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. పవర్ ప్లే ముగిసేలోపే అభిషేక్ పోరెల్ (5), కెఎల్ రాహుల్ (9), సాహిల్ పరాక్ (13) ఇంకా ట్రిస్టన్ స్టబ్స్ (12) వికెట్లు కోల్పోయి 74 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో అక్షర్ పటేల్ (30 బంతుల్లో 56), డేవిడ్ మిల్లర్ (28 బంతుల్లో 51) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయానికి చేరువ చేశారు. అక్షర్ అవుటైన తర్వాత మిల్లర్-అశుతోష్ శర్మ జోడీ 64 పరుగుల భాగస్వామ్యంతో స్కోరు బోర్డును పరిగెత్తించారు.

చివరి ఓవర్ల డ్రామా.. యువ ఆటగాళ్ల విధ్వంసం

చివరి 18 బంతుల్లో 36 పరుగులు అవసరమైన తరుణంలో, అశుతోష్ శర్మ (24) మరియు అరంగేట్రం చేసిన మాధవ్ తివారీ (18 నాటౌట్) ఆకాశమే హద్దుగా చెలరేగారు. స్టోయినిస్ వేసిన 18వ ఓవర్లో వీరు 19 పరుగులు రాబట్టారు. గెలుపునకు 6 పరుగులు కావాల్సిన సమయంలో అశుతోష్ అవుటైనప్పటికీ, ఆకిబ్ నబీ కేవలం 2 బంతుల్లోనే ఒక ఫోర్, ఒక సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించాడు. ఢిల్లీ 19 ఓవర్లలోనే 7 వికెట్లు కోల్పోయి 213 పరుగులు సాధించి గెలుపొందింది.

పంజాబ్ వైఫల్యం.. చాహల్‌కు దక్కని ఓవర్

పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ (2/21) ఆకట్టుకున్నా, మిగిలిన బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ముఖ్యంగా కీలకమైన సమయంలో యజ్వేంద్ర చాహల్‌తో ఒక్క ఓవర్ కూడా వేయించకపోవడం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నిర్ణయంపై విమర్శలకు దారితీసింది. పంజాబ్ కింగ్స్‌కు ఇది వరుసగా నాలుగో ఓటమి కావడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *