Fire Accident: హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో మంగళవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. చే నంబర్ కూడలి వద్ద ఉన్న ఒక ప్రముఖ షోరూమ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్మేసింది. ప్రమాదం జరిగిన సమయంలో షోరూమ్‌లో ఉన్నవారు ప్రాణ భయంతో బయటకు పరుగులు తీశారు.
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. మంటలను అదుపు చేసేందుకు రెండు మూడు ఫైర్ ఇంజన్లతో శ్రమిస్తున్నారు. అయితే, మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో అగ్నిని ఆర్పడం సిబ్బందికి సవాలుగా మారింది. షోరూమ్‌లో ఉన్న వస్తువులన్నీ కాలి బూడిదవుతుండటంతో ఆస్తి నష్టం భారీగానే ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
షోరూమ్ పక్కనే నివాస సముదాయాలు ఉండటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మంటలు పక్క ఇళ్లకు వ్యాపించకుండా ఉండేందుకు అధికారులు ముందు జాగ్రత్తగా చుట్టుపక్కల వారిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. విద్యుత్ సరఫరాను నిలిపివేసి, పోలీసులు ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్నారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
