Tirumala

Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు గమనిక.. మే 1 నుంచి కొత్త దర్శన నిబంధనలు.. పూర్తి వివరాలివే!

Tirumala: వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని ప్లాన్ చేస్తున్న భక్తులకు టీటీడీ కీలక సమాచారం అందించింది. ఎండలు పెరగడం, స్కూళ్లకు సెలవులు రావడంతో తిరుమలకు భక్తుల తాకిడి విపరీతంగా పెరిగింది. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని, సామాన్య భక్తులకు త్వరగా దర్శనం కల్పించేందుకు మే 1 నుంచి కొత్త నిబంధనలను అమలులోకి తీసుకురావాలని టీటీడీ నిర్ణయించింది. ప్రధానంగా వీఐపీ బ్రేక్ దర్శనాలు, ఎస్ఎస్‌డీ (SSD) టోకెన్ల విషయంలో కీలక మార్పులు చేయబోతోంది.

సాధారణంగా వేసవి కాలంలో సామాన్య భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండాల్సి వస్తోంది. ప్రస్తుతం స్లాటెడ్ సర్వదర్శనం (SSD) టోకెన్లు ఉన్న వారికి కూడా దర్శనానికి దాదాపు 23 గంటల సమయం పడుతోంది. ఈ ఇబ్బందులను తొలగించేందుకు మే 1 నుంచి వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఇలా చేయడం వల్ల వీఐపీల కోసం కేటాయించే 2 నుండి 3 గంటల సమయంలో సుమారు 15 వేల మంది సాధారణ భక్తులకు స్వామివారిని దర్శించుకునే అవకాశం కలుగుతుంది.

దీంతో పాటు మే నెల నుంచి స్లాటెడ్ సర్వదర్శనం (SSD) టోకెన్ల జారీని కూడా నిలిపివేసే యోచనలో టీటీడీ ఉంది. గతంలో వైకుంఠ ఏకాదశి సమయంలో అనుసరించిన విధానాన్ని ఈ మూడు నెలల పాటు అమలు చేయాలని చూస్తున్నారు. అన్ని రకాల ప్రత్యేక దర్శనాలను పక్కన పెట్టి, అందరినీ ఒకే కేటగిరీ కింద దర్శనానికి అనుమతించడం వల్ల క్యూలైన్లు వేగంగా కదులుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ కొత్త విధానం వల్ల భక్తులు 8 నుండి 12 గంటల్లోనే దర్శనం పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది.

గత మూడేళ్ల గణాంకాలను పరిశీలిస్తే మే, జూన్, జూలై నెలల్లో ప్రతి నెలా సుమారు 23 లక్షల మంది భక్తులు తిరుమలకు వస్తున్నారు. ఈ ఏడాది కూడా అదే స్థాయిలో రద్దీ ఉండే అవకాశం ఉండటంతో, రోజుకు కనీసం 80 వేల మందికి పైగా భక్తులకు దర్శనం కల్పించడమే లక్ష్యంగా టీటీడీ ఈ జాగ్రత్తలు తీసుకుంటోంది. కాబట్టి మే నెలలో తిరుమల వెళ్లే భక్తులు ఈ మారుతున్న నిబంధనలను గమనించి తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవడం మంచిది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *