India's First Quantum Testbeds

India’s First Quantum Testbeds: అమరావతిలో దేశంలోనే తొలి ‘క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీ’ ప్రారంభం!

India’s First Quantum Testbeds: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సాంకేతిక రంగంలో మరో చారిత్రాత్మక ఘట్టానికి వేదిక కాబోతోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం మధ్యాహ్నం అమరావతిలోని ఎస్‌ఆర్‌ఎం (SRM) యూనివర్సిటీలో దేశంలోనే మొట్టమొదటి ‘క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీస్’ (Quantum Reference Facilities) ను ప్రారంభించనున్నారు. ఈ ప్రారంభోత్సవంతో క్వాంటం కంప్యూటింగ్ రంగంలో టెస్ట్ బెడ్ సౌకర్యం కలిగిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ సరికొత్త చరిత్ర లిఖించనుంది.

ఏమిటీ క్వాంటం టెస్ట్ బెడ్స్?

క్వాంటం వ్యాలీ ప్రాజెక్టులో భాగంగా అమరావతిలోని ఎస్‌ఆర్‌ఎం వర్సిటీలో ఒకటి, గన్నవరంలోని మేధా టవర్స్‌లో మరొకటి చొప్పున రెండు క్వాంటం కంప్యూటర్ టెస్ట్ బెడ్స్‌ను ఏర్పాటు చేశారు.

ఈ క్వాంటం కంప్యూటర్లలో ఉపయోగించిన పరికరాలలో 80 శాతానికి పైగా భారత్ లోనే తయారైనవి కావడం విశేషం. దీనిని ‘క్యూబిట్‌ఫోర్స్’ (QubitForce) సంస్థ రూపొందించింది.

మధ్యాహ్నం 2.30 గంటలకు ఎస్‌ఆర్‌ఎం వర్సిటీలో జరిగే కార్యక్రమంలో సీఎం నేరుగా ఒక టెస్ట్ బెడ్‌ను ఆవిష్కరిస్తారు. అనంతరం మేధా టవర్స్‌లోని రెండో దానిని వర్చువల్‌గా ప్రారంభిస్తారు.

ప్రముఖుల సమక్షంలో సాంకేతిక విప్లవం

ఈ కార్యక్రమానికి జాతీయ స్థాయి శాస్త్రవేత్తలు మరియు విద్యావేత్తలు హాజరుకానున్నారు..కేంద్ర ప్రభుత్వ ప్రధాన శాస్త్ర సలహాదారు అజయ్‌కుమార్ సూద్ ఆన్‌లైన్ ద్వారా పాల్గొంటారు.కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ కార్యదర్శి అభయ్ కరాందికర్, డీఆర్‌డీఓ డైరెక్టర్ జనరల్ డా. ఆర్‌వీ హరిప్రసాద్ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కానున్నారు.ఐఐటీ మద్రాస్, ఐఐటీ తిరుపతి డైరెక్టర్లతో పాటు నేషనల్ క్వాంటం మిషన్ ప్రతినిధులు, స్టార్టప్ నిర్వాహకులు పాల్గొంటారు.

స్వర్ణాంధ్ర 2047 దిశగా..

రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాలు, కళాశాలలకు చెందిన సుమారు 1.5 లక్షల మంది విద్యార్థులు ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని వర్చువల్‌గా వీక్షించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. భవిష్యత్తులో డేటా సెక్యూరిటీ, కాంప్లెక్స్ కంప్యూటింగ్ మరియు శాస్త్రీయ పరిశోధనలలో క్వాంటం టెక్నాలజీ కీలక పాత్ర పోషించనుంది. టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (TIFR) సహకారంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు, ఏపీని గ్లోబల్ టెక్ హబ్‌గా మార్చడంలో ప్రధాన భూమిక పోషించనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *