Israel-Lebanon: పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న తరుణంలో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా-ఇరాన్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్నప్పటికీ, మరోవైపు దశాబ్దాల కాలంగా శత్రు దేశాలుగా ఉన్న ఇజ్రాయెల్ మరియు లెబనాన్ మధ్య శాంతి చర్చలకు వేదిక సిద్ధమైంది. మంగళవారం వాషింగ్టన్లో ఇరు దేశాల రాయబారులు నేరుగా భేటీ కానున్నారు.
శాంతి దిశగా మొదటి అడుగు
ఈ సమావేశం ఇరు దేశాల మధ్య దశాబ్దాల తర్వాత జరుగుతున్న తొలి ముఖాముఖి చర్చలు కావడం విశేషం.
ఇజ్రాయెల్ ప్రధాని బెన్యామిన్ నెతన్యాహు తెలిపిన వివరాల ప్రకారం, ఈ చర్చల ప్రధాన ఉద్దేశ్యం హిజ్బుల్లాను నిరాయుధులను చేయడం మరియు లెబనాన్‌తో శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకోవడం.ఈ భేటీ ఒక ప్రారంభం మాత్రమేనని, పూర్తిస్థాయిలో శాంతి నెలకొనడానికి ఇంకా కొన్ని నెలల సమయం పట్టవచ్చని దౌత్య నిపుణులు విశ్లేషిస్తున్నారు.
హిజ్బుల్లా తీవ్ర వ్యతిరేకత
ఈ చర్చలు సఫలం కాకుండా హిజ్బుల్లా గ్రూపు తీవ్రంగా ప్రయత్నిస్తోంది.. హిజ్బుల్లా నేత నయీమ్ ఖాసెమ్ టీవీ ప్రసంగం ద్వారా లెబనాన్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇజ్రాయెల్‌తో చర్చలు జరపడం నిరర్థకమని, ఈ సమావేశాన్ని తక్షణమే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లెబనాన్ ప్రధాని నవాఫ్ సలామ్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హిజ్బుల్లా మద్దతుదారులు ఇప్పటికే నిరసనలకు దిగారు.
ప్రాంతీయ ఉద్రిక్తతలు మరియు మానవ నష్టం
మార్చి 2 నుంచి కొనసాగుతున్న ఈ యుద్ధం లెబనాన్‌ను అతలాకుతలం చేస్తోంది.
ఇజ్రాయెల్ దాడుల కారణంగా లెబనాన్‌లో ఇప్పటివరకు 2,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.సుమారు పది లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. మరోవైపు వెస్ట్ బ్యాంక్ ప్రాంతంలో ఇజ్రాయెల్ కొత్తగా నిర్మిస్తున్న స్థావరాలపై జర్మనీ వంటి ఐరోపా దేశాలు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నాయి. జర్మన్ ఛాన్సలర్ మెర్జ్ స్వయంగా నెతన్యాహుకు ఫోన్ చేసి తన ఆందోళనను వ్యక్తం చేశారు.
లెబనాన్ ప్రభుత్వం మొదట కాల్పుల విరమణను కోరుతుండగా, ఇజ్రాయెల్ మాత్రం నేరుగా శాంతి ఒప్పందం కావాలని పట్టుబడుతోంది. ఈ వైరుధ్యాల మధ్య వాషింగ్టన్ చర్చలు ఎంతవరకు సత్ఫలితాలను ఇస్తాయో వేచి చూడాలి. అమెరికా ఒత్తిడి మరియు ప్రాంతీయ రాజకీయ సమీకరణలు ఈ శాంతి ప్రక్రియను శాసించనున్నాయి.
