Chandrababu Naidu

Chandrababu Naidu: అమరావతికి కేంద్రం చట్టబద్ధత.. ఏపీలో దీపోత్సవానికి చంద్రబాబు పిలుపు!

Chandrababu Naidu: ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. గురువారం ఉదయం ఆయన ఎన్డీయే (NDA) కూటమి నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. లోక్‌సభలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు – 2026 ఆమోదం పొందడంపై చర్చించిన సీఎం, ఇది ఐదేళ్ల పోరాటానికి దక్కిన విజయమని కొనియాడారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం రాజధాని శంకుస్థాపన జరిగిన ఉద్దండరాయునిపాలెంలో పర్యటించి, అక్కడ జరిగే సంబరాల్లో పాల్గొననున్నట్లు ప్రకటించారు.

జగన్ వైఖరిపై తీవ్ర విమర్శలు

టెలీకాన్ఫరెన్స్‌లో చంద్రబాబు మాట్లాడుతూ.. మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజలు గత ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టినా జగన్ తీరులో మార్పు రాలేదని విమర్శించారు.

అమరావతి అనే పేరు పలకడానికి కూడా ఇష్టపడని జగన్, ‘మావిగన్’ (MAVIGAN – Machilipatnam, Vijayawada, Guntur) వంటి వింత ప్రతిపాదనలతో మళ్లీ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

రాజధానిపై జగన్‌కు ఉన్న ద్వేషం ఈ పేర్ల ద్వారా స్పష్టమవుతోందని, అమరావతిని దెబ్బతీయడమే ఆయన లక్ష్యమని సీఎం ఆరోపించారు.

ఊరూరా పండుగ – ఇంటింటా దీపం

అమరావతికి పార్లమెంట్ సాక్షిగా గుర్తింపు లభించినందుకు కృతజ్ఞతగా రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొనాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

ప్రతి గ్రామంలో సంబరాలు జరుపుకోవాలని, కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని కోరారు. అమరావతికి మద్దతుగా నేడు సాయంత్రం ప్రతి ఒక్కరూ తమ ఇంటి ముందు దీపాలు వెలిగించి ఆనందాన్ని పంచుకోవాలని సూచించారు. అమరావతిపై ఇక ఎలాంటి అనిశ్చితి లేదని, ఇది మనందరి రాజధాని అనే భావన ప్రతి ఒక్కరిలో బలంగా ఉండాలని పేర్కొన్నారు.

కర్నూలులో హైకోర్టు బెంచ్

కేవలం అమరావతి అభివృద్ధే కాకుండా, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రయోజనాలను కాపాడతామని సీఎం హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా సాధ్యమైనంత త్వరగా కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *