Revanth Reddy

Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికు సుప్రీంకోర్టులో ఊరట

Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. పదేళ్ల క్రితం ఆయనపై నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ కేసులో జోక్యం చేసుకోవడానికి ఎటువంటి ప్రాథమిక ఆధారాలు లేవని స్పష్టం చేస్తూ, ఫిర్యాదుదారుడు దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది.

వివాదం నేపథ్యం ఏమిటి?

ఈ కేసు 2016లో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో నమోదైంది. గొట్టిపాటి నివాస గృహాల నిర్మాణానికి సంబంధించి భూవివాదం నేపథ్యంలో, రేవంత్ రెడ్డి తన సోదరుడు కొండల్ రెడ్డి, ఇతరులతో కలిసి స్థలంలోకి చొరబడి కుల వివక్షతో దూషించారని ఎన్. పెద్ది రాజు అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు.

అయితే, ఈ ఘటన జరిగిన సమయంలో రేవంత్ రెడ్డి అక్కడ లేరని, రాజకీయ కక్షతోనే ఆయన పేరును ఇందులో చేర్చారని ఆయన తరఫు న్యాయవాదులు వాదించారు. దీనిని పరిశీలించిన తెలంగాణ హైకోర్టు, గతేడాది జూలైలో ఈ కేసును రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ పిటిషనర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్య బాగ్చీ , జస్టిస్ విపుల్ ఎం. పాంచోలిలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. విచారణ సందర్భంగా న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.. 

“రాజకీయ పోరాటాలు మాకు తెలుసు.. ఇవి కోర్టుల్లో కాకుండా ప్రజల మధ్యే తేల్చుకోవాలి” అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

నిందితుడికి నేరంతో సంబంధం ఉన్నట్లు ఎటువంటి ప్రత్యక్ష ఆధారాలు దర్యాప్తు సంస్థలు చూపలేకపోయాయని, కేవలం అనుమానాల ఆధారంగా కేసు నడపలేమని కోర్టు అభిప్రాయపడింది.

తెలంగాణ హైకోర్టు అన్ని అంశాలను లోతుగా పరిశీలించి ఇచ్చిన తీర్పు “పరిపూర్ణంగా” ఉందని, అందులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *