Kishan Reddy: తెలంగాణలోని తాడిచర్ల-1 బొగ్గు గని కేటాయింపులపై నెలకొన్న సందిగ్ధతకు కేంద్ర ప్రభుత్వం తెరదించింది. ఈ గనిని ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థకు కేటాయించినట్లు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి రాజ్యసభలో అధికారికంగా ప్రకటించారు. 2015 ఆగస్టు 31వ తేదీనే ఈ కేటాయింపులు జరిగాయని, ఇందులో ఎలాంటి మార్పు లేదని ఆయన స్పష్టం చేశారు.
బొగ్గు గనుల కేటాయింపు ప్రక్రియలో వచ్చిన మార్పుల గురించి వివరిస్తూ.. 2019లో ఒక ఉన్నత స్థాయి కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం 2020 జూన్ నుండి కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయని మంత్రి తెలిపారు. సాధారణంగా వ్యాపార అవసరాల కోసం ఉపయోగించే బొగ్గు గనులను కేవలం వేలం ద్వారానే కేటాయించాలని ఆ కమిటీ సూచించిందని చెప్పారు. అయితే, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ నేరుగా కేటాయింపులు చేసే అధికారం ఉంటుందని ఆయన వెల్లడించారు.
రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ అడిగిన ప్రశ్నకు మంత్రి కిషన్ రెడ్డి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఇదే సందర్భంలో తాడిచర్ల-2 గని గురించి కూడా ఆయన కీలక సమాచారం అందించారు. తాడిచర్ల-1 తెలంగాణకు కేటాయించినప్పటికీ, తాడిచర్ల-2 బొగ్గు గనిని మాత్రం ఇప్పటివరకు ఎవరికీ కేటాయించలేదని మంత్రి స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో రాష్ట్రంలోని విద్యుత్ ప్రాజెక్టులకు బొగ్గు సరఫరా విషయంలో కొంత స్పష్టత వచ్చినట్లయింది.
