Loyal Dog: కుక్క అంటే విశ్వాసానికి మారుపేరు అని మన పెద్దలు చెబుతుంటారు. మనుషుల కంటే మూగజీవాలే ఎక్కువ ప్రేమను చూపిస్తాయని మరోసారి నిరూపితమైంది. హిమాచల్ ప్రదేశ్‌లో జరిగిన ఒక హృదయ విదారక ఘటన ఇప్పుడు అందరి కళ్లను చెమ్మగిల్లిస్తోంది.
అసలేం జరిగింది?
హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా జిల్లాకు చెందిన పియూష్ (13), విక్సిత్ రానా అనే ఇద్దరు యువకులు జనవరి 23న ట్రెక్కింగ్ కోసం పర్వత ప్రాంతానికి వెళ్లారు. అయితే అకస్మాత్తుగా భారీ మంచు వర్షం కురవడంతో వారు దారి తప్పిపోయారు. గడ్డకట్టే చలిలో మంచులో చిక్కుకుపోయి ఆ ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు.
మూడు రోజుల పాటు కాపలా..
పియూష్ తన వెంట తన పెంపుడు కుక్కను కూడా తీసుకెళ్లాడు. యజమాని చనిపోయినప్పటికీ, ఆ మూగజీవి అతడిని వదిలి వెళ్లలేదు. ఎముకలు కొరికే చలిని, విపరీతమైన మంచును లెక్కచేయకుండా మూడు రోజుల పాటు తన యజమాని మృతదేహం పక్కనే కూర్చుంది. ఆహారం లేకపోయినా, అడవి జంతువుల భయం ఉన్నా అక్కడి నుంచి అడుగు కూడా పక్కకు వేయలేదు.
ఇది కూడా చదవండి: APPSC Group 2 Final Results: ఏపీపీఎస్సీ గ్రూప్-2 ఎంపిక జాబితా విడుదల
రెస్క్యూ బృందానికే షాక్..
మూడు రోజుల తర్వాత సహాయక బృందాలు అక్కడికి చేరుకున్నాయి. పియూష్ మృతదేహం మంచులో కూరుకుపోయి ఉండగా, ఆ కుక్క పక్కనే కాపలా కాస్తూ కనిపించింది. రెస్క్యూ సిబ్బంది మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా, తన యజమానికి హాని చేస్తున్నారేమోనన్న భయంతో ఆ కుక్క వారిపైకి వెళ్ళింది. చివరకు వారు దానికి నమ్మకం కలిగించి, బుజ్జగించడంతో పక్కకు తప్పుకుంది.
ప్రతికూల వాతావరణంలో కూడా ఆ శునకం చూపిన ప్రేమ, విశ్వాసం చూసి రెస్క్యూ టీమ్ సభ్యులు సైతం కన్నీరు పెట్టుకున్నారు. మనిషికి, మూగజీవికి మధ్య ఉండే విడదీయరాని బంధానికి ఈ ఘటనే నిదర్శనం.
