Bhatti Vikramarka: టెండర్లు దక్కింది మీ వాళ్లకే.. మళ్ళీ మాపైనే ఆరోపణలా?

Bhatti Vikramarka: తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న సింగరేణి సంస్థపై వస్తున్న ఆరోపణలపై ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఘాటుగా స్పందించారు. సింగరేణి సంస్థ రాష్ట్రానికి ఒక ఆత్మ వంటిదని, రాజకీయ ప్రయోజనాల కోసం దానిపై తప్పుడు ప్రచారాలు చేయడం సరికాదని ఆయన మండిపడ్డారు. ముఖ్యంగా బీజేపీ, బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలను ఆయన ఆధారాలతో సహా తిప్పికొట్టారు.

సింగరేణి టెండర్లలో ‘సైట్ విజిట్’ (స్థలాన్ని సందర్శించడం) అనే నిబంధనను తమ ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిందని చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని భట్టి స్పష్టం చేశారు. 2018 మరియు 2021లో కోల్ ఇండియా పంపిన డాక్యుమెంట్లలోనే ఈ నిబంధన ఉందని, అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో లేదని గుర్తు చేశారు. కేవలం సింగరేణిలోనే కాకుండా.. ఎన్ఎండీసీ (NMDC), రైల్వేస్, హిందుస్థాన్ కాపర్స్ వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలతో పాటు గుజరాత్, మహారాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే టెండర్లలో కూడా ఈ నిబంధన ఉందని ఆయన ఉదాహరణలతో వివరించారు.

ఇది కూడా చదవండి: Gali Janardhan Reddy: రాజకీయ కక్షసాధింపా?..జనార్దన్ రెడ్డి ఇంటిని తగలబెట్టిన దుండగులు

ఇక టెండర్లను సృజన్ రెడ్డి అనే వ్యక్తికి కట్టబెడుతున్నారనే విమర్శలపైనా భట్టి విక్రమార్క క్లారిటీ ఇచ్చారు. సృజన్ రెడ్డికి చెందిన ‘సోదా కన్స్ట్రక్షన్’ సంస్థకు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. నిజానికి సృజన్ రెడ్డి బీఆర్ఎస్ మాజీ నేత కందాల ఉపేందర్ రెడ్డికి అల్లుడని, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన టెండర్లలో కూడా బీఆర్ఎస్ నేతల బంధువులకే పనులు దక్కాయని ఆయన ఎద్దేవా చేశారు.

సింగరేణి సంస్థ గత 105 ఏళ్లుగా ఒక బోర్డు ద్వారా స్వతంత్రంగా నడుస్తోందని, టెండర్ల నిర్ణయాలు మంత్రి స్థాయి వరకు రావని భట్టి వివరించారు. అయినప్పటికీ, విమర్శలు రావడంతో పారదర్శకత కోసం ఆ టెండర్లను రద్దు చేయాలని తానే ఆదేశించానని చెప్పారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సింగరేణిపై విచారణ వేయడాన్ని తాము స్వాగతిస్తున్నామని, ఎవరి హయాంలో ఏం జరిగిందో అప్పుడే తేలుతుందని భట్టి విక్రమార్క సవాల్ విసిరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *