Nizamabad

Nizamabad: ఖాకీలనే ఢీకొట్టిన కేటుగాళ్లు.. నిజామాబాద్‌లో గంజాయి ముఠా హల్‌చల్.

Nizamabad: నిజామాబాద్ నగర శివారులో శుక్రవారం అర్ధరాత్రి గంజాయి స్మగ్లర్లు రెచ్చిపోయారు. పోలీసులు, ఎక్సైజ్ సిబ్బంది వాహనాలను తనిఖీ చేస్తుండగా, పట్టుబడతామనే భయంతో నిందితులు తమ కారుతో ఎక్సైజ్ సిబ్బందిని బలంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో విధి నిర్వహణలో ఉన్న మహిళా కానిస్టేబుల్ గాజుల సౌమ్య తీవ్రంగా గాయపడ్డారు. స్మగ్లర్ల కారు వేగంగా వచ్చి ఢీకొట్టడంతో ఆమె ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లారు.

ప్రస్తుతం సౌమ్యను నగరంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. అయితే, ఈ ప్రమాదంలో ఆమె కిడ్నీలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. బాధ్యతాయుతమైన విధుల్లో ఉన్న ఒక మహిళా అధికారిపై ఇలాంటి దాడి జరగడం స్థానికంగా పెద్ద కలకలం రేపింది.

ఘటన జరిగిన వెంటనే అప్రమత్తమైన పోలీసులు, తప్పించుకోవడానికి ప్రయత్నించిన ఆ కారును వెంబడించి పట్టుకున్నారు. కారులో ఉన్న ఇద్దరు స్మగ్లర్లను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుండి 2 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విచారణలో నిందితులు నిర్మల్ జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *