CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. పార్టీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించి, రక్తదానం చేసిన కార్యకర్తలకు స్వయంగా సర్టిఫికెట్లు అందజేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగిస్తూ ఎన్టీఆర్ చేసిన సామాజిక సంస్కరణలను, తెలుగు జాతికి ఆయన అందించిన గౌరవాన్ని గుర్తు చేసుకున్నారు.
తెలుగువారిని ‘మదరాసీలు’ అని పిలుస్తూ అవహేళన చేస్తున్న రోజుల్లో, తెలుగు జాతికి ఒక ప్రత్యేక గుర్తింపును, ఆత్మగౌరవాన్ని తెచ్చిన మహనీయుడు ఎన్టీఆర్ అని చంద్రబాబు కొనియాడారు. రాజకీయాల్లోకి చదువుకున్న వారు రావాలని ఆకాంక్షించి, విద్యావంతులకు ప్రాధాన్యతనిచ్చిన ఘనత ఆయనదేనని చెప్పారు. బడుగు బలహీన వర్గాలకు రాజకీయాల్లో చోటు కల్పిస్తూ బీసీలకు 25 శాతం రిజర్వేషన్లు, మహిళలకు ఆస్తిలో సమాన వాటా కల్పించి ఎన్టీఆర్ చరిత్ర సృష్టించారని వివరించారు. తిరుమలలో నేడు మనం చూస్తున్న అన్నదాన పథకాన్ని ప్రారంభించింది కూడా ఆయనేనని, ఆయన ఆశయాలకు అనుగుణంగానే రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 270 అన్న క్యాంటీన్లను నడుపుతున్నామని, త్వరలోనే వీటి సంఖ్యను 700కు పెంచుతామని హామీ ఇచ్చారు.
Also Read: Medaram Jatara 2026: భక్తుల కోసం ఆర్టీసీ భారీ ఏర్పాట్లు.. ఇంటికే అమ్మవారి ప్రసాదం!
ప్రస్తుత ప్రభుత్వ పాలనపై స్పందిస్తూ, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇచ్చిన మాట ప్రకారం ‘సూపర్ సిక్స్’ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. గత ప్రభుత్వ తీరును విమర్శిస్తూ, భూములపై గత పాలకుల ఫోటోలు వేసుకోవడం వంటి పనుల వల్ల సామాన్యులు ఇబ్బందులు పడ్డారని, ప్రస్తుతం రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను అందిస్తున్నామని చెప్పారు. వచ్చే ఉగాది పండుగ నాటికి మరో 5 లక్షల గృహప్రవేశాలు నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు. రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల్లో ఏపీ వాటా 25 శాతంగా ఉందని, దేశాభివృద్ధిలో ప్రధాని మోదీ నాయకత్వానికి తాము పూర్తి సహకారం అందిస్తున్నామని స్పష్టం చేశారు.
శాంతిభద్రతల విషయంలో చంద్రబాబు కఠిన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల ముసుగులో రౌడీయిజం చేసేవారిని అస్సలు ఉపేక్షించబోమని హెచ్చరించారు. “బాబాయ్‌ని చంపినంత ఈజీ కాదు రాష్ట్రంలో రౌడీయిజం చేయడం.. ఇక్కడ ఉన్నది ఎన్డీయే ప్రభుత్వం, సీబీఎన్ అని గుర్తుపెట్టుకోండి” అంటూ ఘాటుగా స్పందించారు. శాంతిభద్రతలు ఉంటేనే అభివృద్ధి సాధ్యమని, కక్ష సాధింపు చర్యల కోసం తాను రాజకీయాల్లోకి రాలేదని పునరుద్ఘాటించారు. హైదరాబాద్ నగరం నేడు అగ్రగామిగా ఉందంటే అది గత తొమ్మిదేళ్ల టీడీపీ పాలనలో వేసిన పునాదుల వల్లేనని ఆయన గుర్తు చేశారు.
