Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం క్లీన్ ఎనర్జీ (స్వచ్ఛ ఇంధనం) రంగంలో సరికొత్త విప్లవానికి వేదిక కాబోతోంది. కాకినాడలో ఏర్పాటు చేయనున్న దేశంలోనే అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం (జనవరి 17) ఉదయం శంకుస్థాపన చేయనున్నారు. సుమారు 13 వేల కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో గ్రీన్కో గ్రూప్‌కు చెందిన ‘ఏఎమ్ గ్రీన్’ సంస్థ ఈ ప్రతిష్టాత్మక ప్లాంట్‌ను నిర్మిస్తోంది. కనుమ పండుగ వేళ వెలువడిన ఈ ప్రకటన రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధిలో ఒక మైలురాయిగా నిలవనుంది.
ఈ ప్రాజెక్టు ద్వారా ఏటా 1 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పర్యావరణానికి ఎంతో మేలు చేసే ఈ ప్లాంట్ ద్వారా సుమారు 2,600 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. కేవలం దేశీయ అవసరాలకే కాకుండా, ఇక్కడి నుంచి ఉత్పత్తి అయ్యే ఇంధనాన్ని జర్మనీ, సింగపూర్, జపాన్ వంటి అభివృద్ధి చెందిన దేశాలకు ఎగుమతి చేయనుండటం విశేషం. ప్రపంచవ్యాప్తంగా కర్బన ఉద్గారాలను తగ్గించే ప్రయత్నాల్లో భాగంగా ఈ ప్రాజెక్టు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందనుంది.
Also Read: BJP: బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎన్నికకు షెడ్యూల్ విడుదల!
గ్రీన్ ఎనర్జీ రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నారా లోకేష్ ఈ సందర్భంగా వెల్లడించారు. కాకినాడ సెజ్ పరిధిలో 495 ఎకరాల్లో ఈ ప్లాంట్ నిర్మాణం జరగనుంది. సాధారణంగా బొగ్గు లేదా సహజ వాయువుతో తయారయ్యే అమ్మోనియాకు భిన్నంగా, ఈ గ్రీన్ అమ్మోనియాను పూర్తి పర్యావరణ హితమైన పద్ధతుల్లో ఉత్పత్తి చేస్తారు. భవిష్యత్తులో ఈ రంగంలో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా రాష్ట్ర యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
