Kite Festival

Kite Festival: పరేడ్ గ్రౌండ్‌లో కైట్ & స్వీట్ ఫెస్టివల్!

Kite Festival: హైదరాబాద్ నగరం పండుగ సందడితో మెరిసిపోతోంది. సంక్రాంతి సంబరాల్లో భాగంగా సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో తెలంగాణ పర్యాటక శాఖ నిర్వహిస్తున్న అంతర్జాతీయ కైట్, స్వీట్ ఫెస్టివల్ రెండో రోజు అత్యంత వైభవంగా సాగుతోంది. ఆకాశం నిండా రంగురంగుల పతంగులు విహరిస్తుంటే, గ్రౌండ్‌లో రకరకాల మిఠాయిల ఘుమఘుమలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. కేవలం నగరవాసులే కాకుండా, దేశ విదేశాల నుంచి వచ్చిన నిపుణులు కూడా తమ విలక్షణమైన పతంగులతో ఈ వేడుకల్లో పాల్గొనడం విశేషం.

ఈ కైట్ ఫెస్టివల్‌లో మొత్తం 19 దేశాల నుంచి సుమారు 40 మంది ప్రొఫెషనల్ కైట్ ఫ్లయర్స్ తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. వారితో పాటు భారతదేశంలోని 15 రాష్ట్రాల నుండి 55 మంది జాతీయ స్థాయి పతంగుల నిపుణులు ఇక్కడ పోటీ పడుతున్నారు. ఆకాశంలో 100 మీటర్ల పొడవున్న భారీ పాము ఆకారం, తాబేలు, చంద్రుడు, డ్రాగన్, చిన్నారులకు ఇష్టమైన షిన్చాన్, నెమలి ఆకారాల్లో ఉన్న భారీ పతంగులు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. చిన్నారులు, యువత పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ పతంగుల విన్యాసాలను ఆసక్తిగా తిలకిస్తున్నారు.

Also Read: Narendra Modi: మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

మరోవైపు, తీపి ప్రియుల కోసం ఏర్పాటు చేసిన స్వీట్ ఫెస్టివల్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. పంజాబ్, గుజరాత్, పశ్చిమ బెంగాల్, కేరళ, మహారాష్ట్ర వంటి వివిధ రాష్ట్రాలకు చెందిన మహిళలు తమ స్వహస్తాలతో తయారు చేసిన సంప్రదాయ మిఠాయిలను ఇక్కడ విక్రయిస్తున్నారు. సుమారు 60 స్టాళ్లలో రకరకాల రాష్ట్రాల రుచులు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు, హస్తకళాకారులను ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన 100 చేనేత, హస్తకళల స్టాళ్లలో సందర్శకులు కొనుగోళ్లు చేస్తూ ఉత్సాహంగా గడుపుతున్నారు.

వేడుకలు ఇక్కడితోనే ముగియడం లేదు. జనవరి 16 నుంచి 18 వరకు సాయంత్రం వేళల్లో పరేడ్ గ్రౌండ్‌లోనే హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. అలాగే, గచ్చిబౌలి స్టేడియంలో జనవరి 16, 17 తేదీల్లో రెండు రోజుల పాటు డ్రోన్ ఫెస్టివల్ జరగనుంది. రాత్రి వేళల్లో పరేడ్ గ్రౌండ్స్ అంతా ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలతో కళకళలాడుతోంది. పండుగ రోజుల్లో కుటుంబ సభ్యులతో కలిసి ఆహ్లాదంగా గడపడానికి ఈ ఉత్సవాలు ఒక వేదికగా మారాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *