Nazmul Islam: బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) డైరెక్టర్ నజ్ముల్ ఇస్లాం చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఆ దేశ క్రికెట్లో పెను దుమారాన్ని రేపుతున్నాయి. మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్‌ను ఉద్దేశించి ఆయన చేసిన ఇండియన్ ఏజెంట్ అనే వ్యాఖ్యలపై ఆటగాళ్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నజ్ముల్ ఇస్లాం వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని, లేనిపక్షంలో బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (BPL)తో పాటు అన్ని రకాల క్రికెట్ కార్యకలాపాలను బహిష్కరిస్తామని ఆటగాళ్ల సంఘం అల్టిమేటం జారీ చేసింది.
అసలు వివాదం ఏంటంటే? వచ్చే నెలలో భారత్ వేదికగా జరగనున్న టీ20 వరల్డ్ కప్ 2026లో బంగ్లాదేశ్ పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది. భద్రతా కారణాల దృష్ట్యా తమ మ్యాచ్‌లను భారత్ నుండి తరలించాలని బీసీబీ కోరుతోంది. అయితే, దీనిపై తమీమ్ ఇక్బాల్ స్పందిస్తూ.. “భావోద్వేగంతో కాకుండా చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలి, ఐసీసీ ఆదాయంపై ఆధారపడే మనకు వారితో విరోధం మంచిది కాదు” అని సూచించారు. దీనిపై డైరెక్టర్ నజ్ముల్ ఇస్లాం ఫేస్బుక్ వేదికగా స్పందిస్తూ.. తమీమ్‌ను “మరో నిరూపితమైన ఇండియన్ ఏజెంట్” అని సంబోధించడంతో వివాదం ముదిరింది.
Also Read: Naari Naari Naduma Murari Review: నారీ నారీ నడుమ మురారి – మంచి ఫన్ తో సాగే ఫామిలీ డ్రామా!
మద్దతుగా నిలిచిన ఆటగాళ్లు: ఈ వ్యాఖ్యలను సీనియర్ ఆటగాళ్లు ముష్ఫికర్ రహీమ్, తస్కిన్ అహ్మద్, తైజుల్ ఇస్లాం వంటి వారు తీవ్రంగా ఖండించారు. 16 ఏళ్ల పాటు దేశానికి సేవ చేసిన ఆటగాడిని అలా అవమానించడం సహించలేమని స్పష్టం చేశారు. ఒకవైపు ఐసీసీ, బీసీసీఐతో వివాదం నడుస్తుండగానే, సొంత బోర్డులోనే డైరెక్టర్ వర్సెస్ ప్లేయర్స్ అన్నట్లుగా పరిస్థితి మారడంతో బంగ్లాదేశ్ క్రికెట్ భవిష్యత్తు అంధకారంలో పడేలా కనిపిస్తోంది.
