Narendra Modi

Narendra Modi: మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

Narendra Modi: మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పండుగ మన అందరి హృదయాల్లో ఆనందాన్ని, ప్రకృతి పట్ల కృతజ్ఞతా భావాన్ని నింపే అద్భుతమైన సందర్భమని ఆయన కొనియాడారు. ముఖ్యంగా తెలుగు ప్రజల కోసం ఆయన సోషల్ మీడియా వేదికగా తెలుగు భాషలోనే తన సందేశాన్ని పంచుకోవడం అందరినీ ఆకట్టుకుంది. ఈ సంక్రాంతి ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖశాంతులు, ఆరోగ్యం తీసుకురావాలని, ప్రజల కలలన్నీ సాకారం కావాలని ఆయన ఆకాంక్షించారు.

పండుగ వేడుకల్లో భాగంగా ప్రధాని మోదీ ఢిల్లీలోని కేంద్ర మంత్రి ఎల్. మురుగన్ నివాసానికి వెళ్లి పొంగల్ సంబరాల్లో పాల్గొన్నారు. అక్కడ తమిళ సంప్రదాయ పద్ధతుల్లో జరిగిన ప్రత్యేక పూజల్లో ఆయన పాలుపంచుకున్నారు. గోమాత పట్ల మనకున్న భక్తిని చాటుతూ, ప్రధాని స్వయంగా ఆవు, లేగదూడకు మేత తినిపించి, వాటికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంక్రాంతి, పొంగల్, లోహ్రీ, మాఘ బిహు వంటి పండుగలు ప్రకృతికి, కుటుంబానికి సమాజానికి మధ్య ఉన్న విడదీయరాని అనుబంధాన్ని, సమతుల్యతను గుర్తుచేస్తాయని వివరించారు.

Also Read: USA: ట్రంప్ కీలక నిర్ణయం.. 75 దేశాలకి నో “వీసా”

తమిళ సంస్కృతిపై తనకున్న మక్కువను చాటుకుంటూ, గత ఏడాది తనకు లభించిన అరుదైన అవకాశాలను ప్రధాని గుర్తు చేసుకున్నారు. గంగైకొండ చోళపురం ఆలయ సందర్శన, వారణాసిలో జరిగిన కాశీ తమిళ సంగమం వంటి కార్యక్రమాలు భారతదేశ సాంస్కృతిక ఐక్యతను చాటిచెప్పాయని ఆయన అన్నారు. రామేశ్వరంలోని పంబన్ వంతెన ప్రారంభోత్సవ సమయంలో తమిళ చరిత్ర గొప్పతనాన్ని తాను స్వయంగా చూశానని పేర్కొన్నారు. తమిళ సంస్కృతి కేవలం ఒక ప్రాంతానిది కాదని, అది యావత్ భారతదేశానికి, మానవాళికి గర్వకారణమైన ఉమ్మడి వారసత్వమని ఆయన అభివర్ణించారు. ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ అనే స్ఫూర్తిని ఇలాంటి పండుగలు మరింత బలోపేతం చేస్తాయని ప్రధాని మోదీ తన సందేశంలో స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *