AP News: నెల్లూరు జిల్లాలో గురువారం భారీ రైలు ప్రమాదం తప్పింది. విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న ఒక గూడ్స్ రైలు కావలి రైల్వే స్టేషన్ సమీపంలోకి రాగానే అదుపు తప్పి పట్టాలు పక్కకు పోయింది. ఈ ఘటనలో రైలుకు ఉన్న రెండు వ్యాగన్లు (బోగీలు) ఒక్కసారిగా ట్రాక్ మీద నుంచి పక్కకు పడిపోయాయి. అదృష్టవశాత్తూ ఇది సరుకు రవాణా చేసే రైలు కావడంతో పెద్ద ప్రమాదం తప్పిందని, ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన లోకో పైలట్ వెంటనే ఇంజిన్ను నిలిపివేసి రైల్వే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. స్థానికులు కూడా పెద్ద శబ్దం రావడంతో అక్కడికి చేరుకుని ఏం జరిగిందోనని ఆందోళన చెందారు. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది హుటాహుటీన ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. లోకో పైలట్ సురక్షితంగా ఉన్నారని, కేవలం ఆ రెండు బోగీలు మాత్రమే దెబ్బతిన్నాయని రైల్వే శాఖ వెల్లడించింది.
ఈ ప్రమాదం కారణంగా విజయవాడ – తిరుపతి మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రధాన ట్రాక్ పక్కన వ్యాగన్లు పడిపోవడంతో వెనుక వచ్చే రైళ్లను వివిధ స్టేషన్లలో నిలిపివేశారు. ప్రస్తుతం రైల్వే ఇంజనీరింగ్ బృందం యుద్ధ ప్రాతిపదికన ట్రాక్ పునరుద్ధరణ పనులు చేపడుతోంది. పట్టాలు తప్పడానికి గల కారణాలపై అధికారులు విచారణ జరుపుతున్నారు. వీలైనంత త్వరగా మార్గాన్ని పునరుద్ధరించి రైళ్ల రాకపోకలను సాధారణ స్థితికి తెస్తామని అధికారులు తెలిపారు.
