KTR: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైనా, కాంగ్రెస్ ప్రభుత్వం పైనా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఖమ్మంలో బుధవారం జరిగిన సర్పంచుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర హక్కుల గురించి కానీ, నదీ జలాల గురించి కానీ సీఎంకు కనీస అవగాహన లేదని ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఆ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికే కేసీఆర్ ప్రభుత్వంపై అప్పుల నెపం వేస్తూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
కేసీఆర్ హయాంలో చేసిన అప్పుల గురించి కేటీఆర్ స్పష్టత ఇచ్చారు. తెలంగాణ ఏర్పడినప్పుడు రూ. 72 వేల కోట్ల అప్పు ఉంటే, కేసీఆర్ పదవి దిగిపోయే నాటికి అది రూ. 3.50 లక్షల కోట్లకు చేరిందని చెప్పారు. అయితే, ఈ అప్పును ప్రభుత్వం కేవలం రైతులు, పేదలు, పిల్లల భవిష్యత్తు కోసమే పెట్టిన పెట్టుబడిగా ఆయన అభివర్ణించారు. రైతు బంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్, మిషన్ భగీరథ, కల్యాణలక్ష్మి వంటి పథకాలతో పాటు రాష్ట్రంలో నిర్మించిన మెడికల్ కాలేజీలు, కలెక్టరేట్లే ఇందుకు నిదర్శనమని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా పార్లమెంటులో కేసీఆర్ చేసిన అప్పుల వివరాలను స్పష్టంగా చెప్పిందని ఆయన పేర్కొన్నారు.
రైతుల సమస్యల గురించి మాట్లాడుతూ.. జిల్లాలో ముగ్గురు కీలక మంత్రులు ఉన్నప్పటికీ కనీసం ఒక యూరియా బస్తా కూడా రైతులకు దొరకడం లేదని కేటీఆర్ విమర్శించారు. రైతులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ 90 శాతం పూర్తి చేసిన సీతారామ ప్రాజెక్టును ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, దాని ద్వారా లక్షలాది ఎకరాలకు అందాల్సిన సాగునీటిని ఆపేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ మంత్రులు పనులపై కాకుండా కేవలం కమీషన్లపైనే దృష్టి పెట్టారని ఆయన ఘాటుగా విమర్శించారు.
రాజకీయ పరిణామాలపై స్పందిస్తూ.. పంచాయతీ ఎన్నికలను కేటీఆర్ ‘క్వార్టర్ ఫైనల్స్’తో పోల్చారు. ఇందులో బీఆర్ఎస్ మద్దతుదారులు 40 శాతం వరకు గెలిచారని, వచ్చే కార్పొరేషన్ ఎన్నికలు సెమీఫైనల్స్ లాంటివని చెప్పారు. ఫైనల్స్‌లో కచ్చితంగా విజయం సాధించి కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ మారుతున్న నాయకుల గురించి భయపడాల్సిన అవసరం లేదని, కొత్త వారికి నాయకత్వ బాధ్యతలు ఇస్తామని కేటీఆర్ భరోసా ఇచ్చారు. ఏ ఎన్నిక జరిగినా అది కేసీఆర్ గారి కోసమే అనుకుని కారు గుర్తుకు ఓటేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
