Bandi Sanjay

Bandi Sanjay: తెలంగాణలో విద్యా వ్యవస్థ ఆగమైతోంది

Bandi Sanjay: హైదరాబాద్ శంషాబాద్‌లోని ఎస్సాస్సార్ కన్వెన్షన్‌లో జరిగిన ఏబీవీపీ 44వ రాష్ట్ర మహాసభల్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ప్రభుత్వ విద్యా రంగం పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో, ప్రస్తుత రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయని విమర్శించారు. ఒక తరం భవిష్యత్తు నాశనమయ్యేలా విద్యా వ్యవస్థను ఛిన్నాభిన్నం చేశారని ఆయన మండిపడ్డారు.

బీఆర్ఎస్ హయాంలో సుమారు 6 వేలు స్కూళ్లు మూతబడితే, వాటిని తెరిపిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఈ ఒక్క ఏడాదిలోనే మరో 1500 స్కూళ్లను మూసివేసిందని బండి సంజయ్ ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సౌకర్యాలైన టీచర్లు, బెంచీలు, మరుగుదొడ్లు లేకపోవడం వల్లే దాదాపు 2 వేలకు పైగా స్కూళ్లలో ఈ ఏడాది ఒక్క విద్యార్థి కూడా చేరలేదని గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో విద్యార్థులకు ఇస్తామన్న 5 లక్షల భరోసా కార్డులు, ఉచిత ఇంటర్నెట్, స్కూటీల హామీలు ఏమయ్యాయని ఆయన నిలదీశారు.

ముఖ్యంగా ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలు రూ. 10 వేల కోట్లకు చేరడంతో రాష్ట్రంలో ప్రైవేట్ కాలేజీలు మూతపడుతున్నాయని, దీనివల్ల వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజుల కోసం కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. నిరుద్యోగ భృతి, ఉద్యోగాల భర్తీ విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం యువతను వంచిస్తోందని, నిరుద్యోగుల పక్షాన నిలబడి ఏబీవీపీ కార్యకర్తలు పోరాటాలను ఉధృతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

అంతకుముందు, ఏబీవీపీ దిగ్గజ నేత జనమంచి గౌరీశంకర్ జీ జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ‘యువ పురస్కారాన్ని’ నల్గొండకు చెందిన సామాజిక కార్యకర్త భీమనపల్లి శ్రీకాంత్‌కు బండి సంజయ్ అందజేశారు. గౌరీశంకర్ జీ జీవితం విద్యార్థి లోకానికి ఆదర్శమని, నక్సలిజం కోరల్లో చిక్కుకున్న విద్యార్థులను బ్యాలెట్ వైపు మళ్లించిన గొప్ప నాయకుడని కొనియాడారు. 2026 మార్చి నాటికి దేశాన్ని నక్సల్స్ రహిత భారత్‌గా మార్చడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *