Telugu Mahasabhalu: గుంటూరు నగరం వేదికగా మూడో ప్రపంచ తెలుగు మహాసభలు శనివారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. తెలుగు భాషా సంస్కృతులను, అస్తిత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పే లక్ష్యంతో ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. నగర శివార్లలోని ఏటుకూరు బైపాస్ వద్ద గల శ్రీ సత్యసాయి స్పిరిట్యుయల్ సిటీ ప్రాంగణంలో మూడు రోజుల పాటు ఈ మహాసభలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి.
మహాసభల ప్రారంభం సందర్భంగా అన్నమయ్య కీర్తనల సహస్ర గళార్చన కార్యక్రమం భక్తులను, భాషాభిమానులను మంత్రముగ్ధులను చేసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమీడిఘంటం శ్రీనరసింహ ఈ వేడుకను ప్రారంభించగా, గజల్ శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. ఈ ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, విశ్వయోగి విశ్వంజీ వంటి ప్రముఖులు పాల్గొని తెలుగు భాష గొప్పతనాన్ని కొనియాడారు. మొత్తం ఐదు ఉప వేదికలపై సమాంతరంగా సాహితీ సదస్సులు, కవి సమ్మేళనాలు, అవధానాలు వంటి కార్యక్రమాలు రాత్రి 11 గంటల వరకు నిరంతరాయంగా సాగుతాయి.
Also Read: NATS: నాట్స్ బోర్డు ఛైర్మన్గా కిషోర్ కంచర్ల బాధ్యతల స్వీకరణ!
ప్రపంచం నలుమూలల నుండి తెలుగు వెలుగులు
ఈ మహాసభల కోసం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 42 దేశాల నుంచి ప్రతినిధులు తరలివచ్చారు. భాషాభిమానుల కోసం ఆంధ్ర సారస్వత పరిషత్ వసతి, భోజన సౌకర్యాలను ఘనంగా ఏర్పాటు చేసింది. ప్రాంగణమంతా తెలుగు భాషా వికాసానికి కృషి చేసిన 350 మంది ప్రముఖుల చిత్రపటాలతో ‘తెలుగు వెలుగులు’ పేరుతో అలంకరించారు. రామోజీరావు హస్తకళల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనలో ప్రాచీన తెలుగు నాణేలు, పురాతన గ్రంథాలు, సంప్రదాయ వంటకాలు సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. సుమారు 25 వేల మంది విద్యార్థులు ఈ ప్రదర్శనలను తిలకించేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు.
మూడు రోజుల పాటు ప్రముఖుల సందడి
తొలిరోజు సాయంత్రం జరిగే ఆంధ్ర శ్రీపూర్ణకుంభ పురస్కారాల ప్రదాన సభకు ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఇక రెండో రోజు ఆదివారం నాడు మారిషస్ దేశాధ్యక్షుడు ధరమ్బీర్ గోకుల్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. అదే రోజున ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు పలువురు మంత్రులు పాల్గొంటారు. మహాసభల ముగింపు రోజైన సోమవారం నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రసంగించనున్నారు. ఘంటసాల, ఎస్పీ బాలు పేర్లతో నామకరణం చేసిన ఈ వేదికలు తెలుగు సంగీత, సాహిత్య వైభవాన్ని ప్రపంచానికి మరోసారి పరిచయం చేస్తున్నాయి.
