NATS

NATS: నాట్స్ బోర్డు ఛైర్మన్‌గా కిషోర్ కంచర్ల బాధ్యతల స్వీకరణ!

NATS:  ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) బోర్డు నూతన ఛైర్మన్‌గా ప్రముఖ వ్యాపారవేత్త కిషోర్ కంచర్లకు కీలక బాధ్యతలు అప్పగిస్తూ ఆ సంస్థ నిర్ణయం తీసుకుంది. అమెరికాలో స్థిరపడిన తెలుగువారికి కష్టకాలంలో కొండంత అండగా నిలుస్తున్న నాట్స్ సంస్థకు 2026-27 సంవత్సరాలకు గానూ ఆయన సారథ్యం వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా, గుడివాడ సమీపంలోని రిమ్మనపూడి గ్రామానికి చెందిన కిషోర్ కంచర్ల ఐటీ ఉద్యోగిగా అమెరికాలో తన ప్రస్థానాన్ని ప్రారంభించి, ఆ తరువాత  స్వయంకృషితో బావర్చి పేరుతో రెస్టారెంట్ స్థాపించి వ్యాపార రంగంలో అసాధారణ విజయాలను అందుకున్నారు. ముఖ్యంగా ‘బావర్చి’ రెస్టారెంట్ (Bawarchi Restaurant) బ్రాండ్ అతి తక్కువ కాలంలోనే అమెరికా అంతటా విస్తరించి విశేష గుర్తింపు పొందింది.

వ్యాపార రంగంలోనే కాకుండా సామాజిక సేవా రంగంలోనూ కిషోర్ కంచర్ల తనదైన ముద్ర వేస్తున్నారు. నాట్స్ సంస్థతో ఆయనకు ఉన్న సుదీర్ఘ అనుబంధం, సేవా దృక్పథాన్ని గుర్తించిన బోర్డు, ఛైర్మన్ పదవికి ఆయనే సరైన వ్యక్తిగా భావించి ఈ బాధ్యతలు అప్పగించింది. ఇదే క్రమంలో ఇప్పటివరకు ఛైర్మన్‌గా సేవలందించిన ప్రశాంత్ పిన్నమనేనికి నాట్స్ బోర్డు ఘనంగా వీడ్కోలు పలికింది. తన పదవీ కాలంలో నాట్స్ 2.0 ద్వారా అనేక కీలక సంస్కరణలు ప్రవేశపెట్టిన ప్రశాంత్, అమెరికాలోని తెలుగు ప్రజలకు సంస్థను మరింత చేరువ చేయడంలో విజయం సాధించారు. సంస్థ ప్రతిష్టను పెంచడంలో ఆయన చూపిన చొరవను, అంకితభావాన్ని బోర్డు సభ్యులు ప్రత్యేకంగా ప్రశంసించారు. కొత్త ఛైర్మన్ కిషోర్ కంచర్ల నాయకత్వంలో నాట్స్ మరిన్ని సేవా శిఖరాలను అధిరోహిస్తుందని బోర్డు ఆశాభావం వ్యక్తం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *