Sharmila: ఉపాధి హామీపై కుట్ర

Sharmila: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా)పై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న చర్యలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఉపాధి హామీని నిర్వీర్యం చేసేలా కేంద్రం కుట్రలు చేస్తుంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మౌనంగా ఉండటం దారుణమని ఆమె మండిపడ్డారు.

బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘జీ రామ్ జీ’ అనే కొత్త చట్టం ద్వారా నరేగా పథకానికి గండి కొట్టే ప్రయత్నం జరుగుతోందని షర్మిల ఆరోపించారు. ఈ చట్టం అమలైతే రాష్ట్రంపై ఏటా రూ.4,500 కోట్ల అదనపు భారం పడుతుందని వెల్లడించారు. ఈ విషయం తెలిసి కూడా సీఎం చంద్రబాబు ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు.

గ్రామీణ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఉపాధి హామీ పథకం వెన్నెముకగా నిలిచిందని, వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో దేశంలోనే తొలి జాబ్ కార్డు ఏపీలోనే ఇచ్చామని గుర్తు చేశారు. ఈ పథకం ద్వారా ఏటా సుమారు 80 లక్షల మంది పేదలకు ఉపాధి లభిస్తోందన్నారు.

ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో నెలనెలా జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం, నరేగా నిధుల్లో 40 శాతం వాటాను ఎక్కడి నుంచి తీసుకొస్తుందని ఆమె ప్రశ్నించారు. నిరుద్యోగం ఎక్కువగా ఉన్న రాష్ట్రంలో ఉపాధి పథకానికి ఉరి వేస్తుంటే ప్రజలకు ఏం సమాధానం చెబుతారని నిలదీశారు.

“మీరు రాష్ట్ర ముఖ్యమంత్రా? లేక మోదీ చేతిలో తోలుబొమ్మనా?” అంటూ చంద్రబాబును ఉద్దేశించి షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉపాధి హామీకి భంగం కలిగించే ‘జీ రామ్ జీ’ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కూటమి పార్టీలను కోరారు.

లేనిపక్షంలో, ఈ నిర్లక్ష్యాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగడుతుందని షర్మిల హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *