Road Accident

Road Accident: ఖమ్మంలో స్కూల్ బస్సు బోల్తా.. 20 మంది

Road Accident: ఖమ్మం జిల్లాలో పెను ప్రమాదం తృటిలో తప్పింది. శుక్రవారం (జనవరి 2) సాయంత్రం విద్యార్థులతో వెళ్తున్న ఒక ప్రైవేట్ స్కూల్ బస్సు అదుపు తప్పి కాలవలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో సుమారు 20 మంది విద్యార్థులు గాయపడగా, విద్యార్థుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా భయానకంగా మారింది. డ్రైవర్ మద్యం మత్తులో ఉండటమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని తెలుస్తోంది.

అదుపు తప్పిన అంజన్న వాహనం..

వేంసూరు మండలం మొద్దులగూడెంలోని శ్రీ వివేకానంద విద్యాలయానికి చెందిన బస్సు, సాయంత్రం పాఠశాల ముగిసిన తర్వాత విద్యార్థులను ఇళ్లకు చేర్చే క్రమంలో గణేష్‌పాడు – సోబ్బాయిగూడెం గ్రామాల మధ్య ప్రమాదానికి గురైంది. బస్సు నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కనే ఉన్న NSP సబ్ కెనాల్‌లోకి పల్టీ కొట్టింది. ఆ సమయంలో కాలవలో నీరు లేకపోవడంతో పెను ప్రాణాపాయం తప్పింది. లేదంటే పరిస్థితి మరింత దారుణంగా ఉండేదని స్థానికులు చెబుతున్నారు.

మద్యం మత్తులో డ్రైవర్.. పరిమితికి మించి విద్యార్థులు!

ఈ ప్రమాదంపై విద్యార్థులు చెబుతున్న మాటలు వింటే పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. బస్సు నడుపుతున్న సమయంలో డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా, బస్సు సామర్థ్యం కంటే రెట్టింపు సంఖ్యలో విద్యార్థులను ఎక్కించడం మరో కారణంగా కనిపిస్తోంది. ఒక కథనం ప్రకారం బస్సులో ఏకంగా 107 మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. ఇంత భారీ సంఖ్యలో పిల్లలను ఒకే బస్సులో ఎక్కించడం భద్రతా నిబంధనలను తుంగలో తొక్కడమేనని తల్లిదండ్రులు మండిపడుతున్నారు.

ఇది కూడా చదవండి: Ragging: ర్యాగింగ్ కలకలం.. విద్యార్థులతో కలిసి ప్రొపెసర్..

సకాలంలో స్పందించిన స్థానికులు..

ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక గ్రామస్తులు పరుగున వచ్చి బస్సు అద్దాలు పగులగొట్టి లోపల చిక్కుకున్న విద్యార్థులను బయటకు తీశారు. గాయపడిన సుమారు 20 మంది విద్యార్థులను 108 అంబులెన్స్‌లో వేంసూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కొంతమంది విద్యార్థులకు తలలు, కళ్ళు మరియు చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బస్సును పరిశీలించారు.

యాజమాన్యంపై ఆగ్రహం..

పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్న పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. డ్రైవర్ లైసెన్స్, బస్సు ఫిట్‌నెస్ సర్టిఫికేట్‌లను అధికారులు తనిఖీ చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన స్కూల్ యాజమాన్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *