Nandyal

Nandyal: నంద్యాల జిల్లాలో విషాదం: ముగ్గురు పిల్లలకు విషమిచ్చి తండ్రి ఆత్మహత్య!

Nandyal: నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండలం తుడుములదిన్నె గ్రామంలో గురువారం ఒక కన్నతండ్రి చేసిన ఘాతుకం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. తన ముగ్గురు చిన్నారి పిల్లలకు విషం కలిపిన పానీయాన్ని తాగించి హతమార్చి, ఆపై తాను కూడా ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ హృదయవిదారక ఘటనలో వేములపాటి సురేంద్ర (35)తో పాటు అతని పిల్లలు కావ్యశ్రీ (7), జ్ఞానేశ్వరి (4),  రెండేళ్ల పసివాడు సూర్యగగన్‌ మృతి చెందారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ఇలా విగతజీవులుగా పడి ఉండటం చూసి గ్రామం మొత్తం కన్నీరుమున్నీరవుతోంది.

ఈ దారుణానికి గల కారణాలను పరిశీలిస్తే, సురేంద్ర భార్య మహేశ్వరి గత ఏడాది (2025) ఆగస్టు 16న అనారోగ్య సమస్యలతో ఆత్మహత్య చేసుకుంది. భార్య మరణం తర్వాత సురేంద్ర మానసికంగా తీవ్రంగా కుంగిపోయాడు. భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్న అతడు, పిల్లల ఆలనాపాలనా చూసుకోవడం భారంగా భావించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మద్యానికి బానిసైన సురేంద్ర, నిరాశ నిస్పృహలతో తన పిల్లలను పెంచడం తనవల్ల కాదని భావించి ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: AP: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు..

సమాచారం అందుకున్న ఎస్సై రామిరెడ్డి తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పిల్లలకు పాలల్లో లేదా కూల్ డ్రింక్‌లో విషం కలిపి ఇచ్చి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ కలహాలు ఏవైనా ఉన్నాయా లేక కేవలం మానసిక ఒత్తిడి వల్లే ఇలా జరిగిందా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తల్లి లేని పిల్లలకు తండ్రే కాలయముడిగా మారిన ఈ ఘటన జిల్లావ్యాప్తంగా విషాదం నింపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *