Bandi Sanjay

Bandi Sanjay: తెలంగాణే టార్గెట్.. బీజేపీ నెక్స్ట్ ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా బీజేపీ జాతీయ నాయకత్వం సిద్ధమవుతోంది. బెంగాల్, తమిళనాడు ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే, పార్టీ అగ్రనేతలందరూ తెలంగాణపైనే పూర్తిస్థాయిలో దృష్టి సారించనున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వెల్లడించారు. ఈసారి రాష్ట్రంలో బీజేపీ అధికారం చేపట్టడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

కరీంనగర్‌లో జరిగిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో బీజేపీ విజయం సాధిస్తేనే, దేశాన్ని “కాంగ్రెస్ ముక్త్ భారత్” గా మార్చాలనే లక్ష్యం నెరవేరుతుందని ఆయన పేర్కొన్నారు. కేరళ వంటి కమ్యూనిస్ట్ కోటల్లోనే బీజేపీ జైత్రయాత్ర మొదలైందని, కార్యకర్తల కష్టంతో అక్కడ మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించామని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

పశ్చిమ బెంగాల్‌ తరహాలోనే తెలంగాణలోనూ పార్టీని బలోపేతం చేస్తామని బండి సంజయ్ చెప్పారు. బెంగాల్‌లో అధికార పార్టీ ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా, కార్యకర్తలు వెనకడుగు వేయకుండా పోరాడుతున్నారని.. అదే స్ఫూర్తితో తెలంగాణలోనూ ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. ఢిల్లీలోని పార్టీ పెద్దలందరి చూపు ఇప్పుడు తెలంగాణపైనే ఉందని, త్వరలోనే ఇక్కడ భారీ మార్పులు రాబోతున్నాయని ఆయన స్పష్టం చేశారు.

బీజేపీ అధికారం చేపట్టడాన్ని ఎవరూ అడ్డుకోలేరని, రాబోయే మున్సిపల్ ఎన్నికల నుంచే పార్టీ సత్తా చాటాలని బండి సంజయ్ కార్యకర్తలను ఉత్సాహపరిచారు. ఈ క్రమంలో ప్రతి కార్యకర్త క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లి పార్టీ సిద్ధాంతాలను వివరించాలని ఆయన సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *