Komatireddy: సంక్రాంతి పండుగ పూట సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ముఖ్యంగా హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై జనవరి 8వ తేదీ నుంచే వాహనాల రద్దీ విపరీతంగా పెరిగే అవకాశం ఉందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు. పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రయాణికులు గమ్యస్థానాలకు సురక్షితంగా, త్వరగా చేరుకోవాలన్నదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్దేశమని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు.
గత ఏడాది పండుగ సమయంలో ఎదురైన ట్రాఫిక్ కష్టాలను దృష్టిలో పెట్టుకుని, ఈసారి ముందస్తుగా కసరత్తు చేస్తున్నారు. పండుగ రోజుల్లో విజయవాడ హైవేపై రోజుకు సుమారు లక్ష వాహనాలు ప్రయాణించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఎల్బీనగర్, వనస్థలిపురం, పనామా గోడౌన్, హయత్ నగర్ మరియు రామోజీ ఫిల్మ్ సిటీ సమీప ప్రాంతాల్లో ట్రాఫిక్ ఎక్కువగా జామ్ అయ్యే అవకాశం ఉన్నందున, అక్కడ ప్రత్యేక నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని పర్యవేక్షించేందుకు మంత్రి స్వయంగా రేపు తూప్రాన్ పేట్, అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతాల్లో పర్యటించనున్నారు.
వాహనాల రాకపోకలకు ఆటంకం కలగకుండా ఉండేందుకు మంత్రి కొన్ని కఠినమైన సూచనలు చేశారు. పండుగ రద్దీ ఉండే రోజుల్లో హైవేలపై ఎలాంటి రోడ్డు పనులు చేయకూడదని, భారీ యంత్రాలను వాడకూడదని స్పష్టం చేశారు. ఒకవేళ అత్యవసరంగా పనులు చేయాల్సి వస్తే, కేవలం వాహనాల రాక తక్కువగా ఉండే రాత్రి వేళల్లో మాత్రమే పూర్తి చేయాలని చెప్పారు. రోడ్లపై ఉన్న మట్టి, నిర్మాణ సామాగ్రిని వెంటనే తొలగించి, అన్ని లేన్లను వాహనాల కోసం సిద్ధంగా ఉంచాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ప్రయాణికులకు స్పష్టతనిచ్చేందుకు రోడ్డు పనులు జరిగే చోట పగలు మరియు రాత్రి వేళల్లో హై-విజిబిలిటీ ట్రాఫిక్ బోర్డులు, కోన్లు మరియు బారికేడ్లను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. ఎక్కడా కన్ఫ్యూజన్ లేకుండా సైన్ బోర్డులు ఉండాలని సూచించారు. టోల్ ప్లాజాలు, రద్దీగా ఉండే జంక్షన్ల వద్ద అదనపు పోలీస్ బలగాలను మోహరించి, స్థానిక ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం చేసుకుంటూ ట్రాఫిక్ సాఫీగా సాగేలా చూడాలని అధికారులను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆదేశించారు.
