CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని కుటుంబ సమేతంగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున 1.30 గంటలకు వైకుంఠ ద్వారాలు తెరుచుకోగానే, సీఎం రేవంత్ తన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని సందర్శించి, పవిత్రమైన ఉత్తర ద్వారం గుండా బయటకు వచ్చారు. ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రికి టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఉన్నతాధికారులు ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు. శ్రీవారి దర్శనం అనంతరం అర్చకులు ముఖ్యమంత్రి కుటుంబానికి తీర్థప్రసాదాలు అందజేసి, రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనం చేశారు.
Also Read: Mukkoti Ekadashi: ముక్కోటి శోభ: దేవాలయాలకు పోటెత్తిన భక్త కోటి
ఈ ప్రత్యేక పర్వదినాన కేవలం తెలంగాణ ముఖ్యమంత్రి మాత్రమే కాకుండా, ఏపీ మరియు తెలంగాణకు చెందిన పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. కేంద్ర మంత్రి కింజర్పు రామ్మోహన్ నాయుడు, ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు తదితరులు స్వామివారి ఆశీస్సులు పొందారు. వీఐపీల దర్శనానంతరం సర్వదర్శనం టోకెన్లు ఉన్న సామాన్య భక్తులను వైకుంఠ ద్వారం గుండా దర్శనానికి అనుమతించారు.
ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని తిరుమల కొండ భక్తులతో కిక్కిరిసిపోయింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ పటిష్టమైన ఏర్పాట్లు చేసింది. వైకుంఠ ద్వార దర్శనం కోసం ముందస్తుగా టోకెన్లు జారీ చేసిన భక్తులను మాత్రమే ప్రస్తుతం అనుమతిస్తున్నారు. పోలీసులు, టీటీడీ భద్రతా సిబ్బంది సమన్వయంతో క్యూలైన్లను పర్యవేక్షిస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. తిరుమలలోనే కాకుండా తెలంగాణలోని భద్రాచలం, యాదాద్రి, ధర్మపురి ఏపీలోని సింహాచలం, అన్నవరం వంటి ప్రముఖ వైష్ణవ క్షేత్రాల్లో కూడా వైకుంఠ ద్వార దర్శనాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి.
