Kangana Ranaut: 10 ఏండ్లు.. 12.. జ్యోతిర్లింగాలు… ఓం నమః శివాయ

Kangana Ranaut: ప్రముఖ బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ దశాబ్దకాలంగా సాగిస్తున్న తన ఆధ్యాత్మిక యాత్రను విజయవంతంగా ముగించారు. దేశవ్యాప్తంగా ఉన్న 12 జ్యోతిర్లింగాల దర్శనాన్ని ఆమె సంపూర్ణంగా పూర్తి చేశారు. ఇటీవల భీమశంకర జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవడంతో ఆమె సంకల్పం నెరవేరింది.

ఈ విషయాన్ని కంగనా ఆదివారం సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. సంప్రదాయ వస్త్రధారణలో శివలింగానికి పాలాభిషేకం చేస్తూ, పూజల్లో పాల్గొన్న ఫొటోలను ఆమె పోస్ట్ చేశారు.

ఈ సందర్భంగా కంగనా భావోద్వేగంగా స్పందిస్తూ,
మహాదేవుడి దయతో, నా పూర్వీకుల పుణ్యఫలంతో నేను ఈరోజు 12 జ్యోతిర్లింగాల దర్శనాన్ని పూర్తి చేయగలిగాను. పదేళ్లకు పైగా సాగిన నా ఆధ్యాత్మిక ప్రయాణం భీమశంకర దర్శనంతో ముగిసింది” అని పేర్కొన్నారు.

ప్రారంభంలో తన ప్రయాణాల్లో యాదృచ్ఛికంగా కొన్ని జ్యోతిర్లింగాల దర్శనం జరిగిందని, కానీ ఇటీవల గట్టి సంకల్పంతో మిగిలిన ఆలయాలన్నింటినీ దర్శించుకోవాలని నిర్ణయించుకున్నానని కంగనా వెల్లడించారు.

భీమశంకర జ్యోతిర్లింగం ప్రత్యేకతను వివరిస్తూ, అక్కడ శివుడు–శక్తి అర్ధనారీశ్వర రూపంలో ఒకే లింగంలో కొలువై ఉంటారని తెలిపారు. రోజులో ఎక్కువ సమయం ఈ శివలింగం వెండి కవచంతో కప్పబడి ఉంటుందని, కేవలం 10 నిమిషాలు మాత్రమే ప్రాచీన లింగ దర్శనానికి అవకాశం లభిస్తుందని చెప్పారు. ఆ అరుదైన సమయంలోనే తాను దర్శనం చేసుకున్నానని పేర్కొంటూ, “హరహర మహాదేవ్” అంటూ తన పోస్ట్‌ను ముగించారు.

ఇటీవల కంగనా గృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం, అంతకుముందు వైద్యనాథ్ జ్యోతిర్లింగాన్ని కూడా దర్శించుకున్నారు. ఇప్పుడు భీమశంకర దర్శనంతో ఆమె 12 జ్యోతిర్లింగాల ఆధ్యాత్మిక యాత్రకు సంపూర్ణత లభించింది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *