Hyderabad: తెలంగాణలో రైతు భరోసా పథకాన్ని నిలిపివేస్తున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అవన్నీ పూర్తిగా అవాస్తవమని తెలంగాణ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ విభాగం ‘ఎక్స్’ వేదికగా స్పష్టం చేసింది. ఇటువంటి ప్రచారం దురుద్దేశంతో సాగుతోందని పేర్కొంది.
రాష్ట్రంలో ప్రస్తుతం 65 లక్షల మంది రైతులు రైతు భరోసా పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారని, అలాంటి కీలక పథకాన్ని ప్రభుత్వం నిలిపివేయడం జరగదని ఫ్యాక్ట్ చెక్ విభాగం తేల్చి చెప్పింది. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో జరుగుతున్న వెరిఫికేషన్‌పై కూడా ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.
నిజమైన రైతులకే ప్రయోజనం అందేలా క్షేత్రస్థాయిలో జిల్లా కమిటీలు వెరిఫికేషన్ నిర్వహిస్తున్నాయని తెలిపింది. లబ్ధిదారులకు చెల్లింపుల కోసం ఆర్థిక శాఖ జాబితాలను సిద్ధం చేసి తనిఖీలు చేపడుతోందని వెల్లడించింది. కాబట్టి రైతు భరోసా నిలిపివేస్తున్నారనే ప్రచారం పూర్తిగా తప్పుదోవ పట్టించేదిగా ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇదే సమయంలో, వాణిజ్య వినియోగంలో ఉన్న భూముల విషయంలో మాత్రమే శాటిలైట్ మ్యాపింగ్ నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, జర్మన్ సాంకేతిక పరిజ్ఞానంతో ఈ ప్రక్రియ చేపడుతోందని వెల్లడించింది. 2024లో నిర్వహించిన సర్వేలో సుమారు నాలుగు లక్షల ఎకరాల భూమి వాణిజ్య అవసరాల కోసం వినియోగంలో ఉన్నట్లు, ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపింది.
ఈ శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా భూమి నిజంగా సాగులో ఉందా లేదా రియల్ ఎస్టేట్ వెంచర్‌గా మారిందా అనే విషయాన్ని నిర్ధారిస్తామని ప్రభుత్వం పేర్కొంది. గత ఏడాది రైతు భరోసా పథకం కింద రూ.8,500 కోట్ల నుంచి రూ.9 వేల కోట్ల వరకు రైతుల ఖాతాల్లో జమ చేశామని వెల్లడించింది.
రైతు భరోసా పథకానికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి కొత్త షరతులు విధించలేదని స్పష్టం చేసింది. పంట పండించే ప్రతి రైతు ఈ పథకానికి అర్హుడేనని తెలిపింది. ఒకవేళ జాబితా నుంచి పేర్లు తొలగించబడినా లేదా అభ్యంతరాలు ఉంటే, రైతులు జిల్లా కలెక్టర్ లేదా జిల్లా స్థాయి రెవెన్యూ అధికారులను సంప్రదించవచ్చని సూచించింది.
