Delhi; జలాంతర్గామిలో ప్రయాణించనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Delhi: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జలాంతర్గామిలో ప్రయాణించనున్నారు. ఈ నెల 28న కర్ణాటకలోని కార్వార్ హార్బర్‌ నుంచి ఆమె ఈ ప్రత్యేక ప్రయాణం చేపట్టనున్నట్లు రాష్ట్రపతి భవన్ వెల్లడించింది. శనివారం నుంచి నాలుగు రోజుల పాటు ఆమె గోవా, ఝార్ఖండ్, కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటించనున్నారు.

ఈ పర్యటనలో భాగంగా భారత నౌకాదళ సామర్థ్యాలను ప్రత్యక్షంగా పరిశీలించే కార్యక్రమంలో పాల్గొననున్న రాష్ట్రపతి, జలాంతర్గామిలో ప్రయాణిస్తారని అధికారిక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రయాణం దేశ రక్షణ రంగంలో మహిళల భాగస్వామ్యాన్ని, సాయుధ దళాల శక్తిని ప్రతిబింబించే ఘట్టంగా భావిస్తున్నారు.

ఇంతకుముందు కూడా రాష్ట్రపతి ముర్ము పలు చారిత్రక గగనయానాలు చేశారు. రెండు నెలల క్రితం హర్యానాలోని అంబాలా వైమానిక స్థావరం నుంచి రఫేల్ యుద్ధ విమానంలో ఆమె గగన విహారం చేశారు. అలాగే, 2023 మే 8న అసోంలోని తేజ్‌పూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి సుఖోయ్–30 ఎంకేఐ యుద్ధ విమానంలో ప్రయాణించారు.

సుఖోయ్–30 ఎంకేఐ యుద్ధ విమానంలో విహరించిన రెండో మహిళా రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము గుర్తింపు పొందారు. అంతకుముందు 2009లో మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ గగనయానం చేయగా, 2006లో మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం కూడా సుఖోయ్ విమానంలో ప్రయాణించారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేపడుతున్న ఈ జలాంతర్గామి ప్రయాణం దేశ రక్షణ రంగ చరిత్రలో మరో ముఖ్యమైన ఘట్టంగా నిలవనుంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *