Chennai: చిన్నారులను ఇంటర్నెట్లోని అశ్లీల, హానికర కంటెంట్ నుంచి రక్షించాల్సిన అవసరం ఉందని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగాన్ని నిషేధించేలా చట్టం తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వానికి కీలక సూచన చేసింది. ఆస్ట్రేలియాలో అమలవుతున్న చట్టం తరహాలోనే భారత్‌లోనూ నిబంధనలు రూపొందించాలంటూ సిఫార్సు చేసింది.
ఎస్. విజయ్‌కుమార్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై మదురై ధర్మాసనం విచారణ చేపట్టింది. జస్టిస్ జి. జయచంద్రన్, జస్టిస్ కేకే రామకృష్ణన్‌లతో కూడిన ధర్మాసనం, ఇంటర్నెట్లో అశ్లీల చిత్రాలు, వీడియోలు సులభంగా అందుబాటులో ఉండటం వల్ల చిన్నారుల భవిష్యత్ ప్రమాదంలో పడుతోందని అభిప్రాయపడింది. ఈ తరహా కంటెంట్‌ను నియంత్రించేలా సాంకేతిక పరిష్కారాలు తీసుకురావాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
పిటిషనర్ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం, కేవలం కంటెంట్ నియంత్రణే కాకుండా చిన్నారులను పూర్తిగా సోషల్ మీడియాకు దూరంగా ఉంచేలా చట్టపరమైన చర్యలు అవసరమని స్పష్టం చేసింది. అలాంటి చట్టం అమల్లోకి వచ్చేలోపు, పిల్లలు మరియు వారి తల్లిదండ్రుల్లో సోషల్ మీడియా వినియోగంపై అవగాహన పెంచాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను, బాలల హక్కుల కమిషన్లను ఆదేశించింది.
ఇటీవల ఆస్ట్రేలియా ప్రభుత్వం 16 ఏళ్లలోపు పిల్లలు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టిక్‌టాక్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఖాతాలు తెరవడాన్ని నిషేధిస్తూ చట్టం తీసుకువచ్చిన విషయం తెలిసిందే. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు విధించేలా అక్కడ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే భారత్‌లోనూ ఇలాంటి చట్టాన్ని పరిశీలించాలని మద్రాస్ హైకోర్టు కేంద్రానికి సూచించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
