Vemulawada

Vemulawada: వేములవాడ రాజన్న సన్నిధిలో భక్తుల సందడి.. దర్శనానికి 5 గంటల సమయం!

Vemulawada: రాజన్న క్షేత్రం వేములవాడ భక్తులతో కిక్కిరిసిపోయింది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంతో పాటు, అనుబంధ ఆలయమైన భీమేశ్వర స్వామి సన్నిధికి భక్తులు భారీగా తరలివచ్చారు. సాధారణంగానే రాజన్న దర్శనం పుణ్యప్రదమని భావించే భక్తులు, రాబోయే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కంటే ముందే ఇక్కడ మొక్కులు చెల్లించుకోవడం ఒక ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలోనే స్వామివారిని దర్శించుకుని కోడె మొక్కులు చెల్లించడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

వరుసగా సెలవు రోజులు రావడంతో తెలంగాణ నలుమూలల నుంచే కాకుండా, పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలన్నీ భక్తజన సందోహంతో నిండిపోయాయి. భక్తులు స్వామివారికి ఎంతో ఇష్టమైన కోడె మొక్కులను చెల్లించుకుని, ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అనంతరం బద్ది పోచమ్మ అమ్మవారిని దర్శించుకుని, అమ్మవారికి బోనాలు సమర్పించి పట్నం మొక్కులు చెల్లించుకున్నారు.

రద్దీ పెరగడంతో ధర్మదర్శనానికి సుమారు 5 గంటలకు పైగా సమయం పడుతోంది. క్యూలైన్లలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో రమాదేవి స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. తాగునీరు, ఇతర సౌకర్యాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఏఎస్పీ రిత్విక్ సాయి ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరంతరం నిఘా కొనసాగిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *