YS Jagan: మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. కాపు సామాజిక వర్గంలో తిరుగులేని నాయకుడిగా ఎదిగిన వంగవీటి మోహన రంగా వర్ధంతి సందర్భంగా జగన్ ఆయనకు నివాళులు అర్పించారు. పేదల సమస్యలను తన సమస్యలుగా భావించి, వారి గొంతుకగా నిలిచిన గొప్ప నాయకుడు రంగా అంటూ జగన్ కొనియాడారు. అయితే, గత ఐదేళ్ల పాలనలో రంగా పేరును పెద్దగా ప్రస్తావించని జగన్, ఇప్పుడు అకస్మాత్తుగా స్పందించడం వెనుక బలమైన రాజకీయ కారణాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
గతంలో వంగవీటి రంగా కుమారుడు వంగవీటి రాధా వైసీపీలో ఉన్న సమయంలో పార్టీ పరంగా రంగా జయంతి, వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించేవారు. కానీ రాధా వైసీపీని వీడి టీడీపీలోకి వెళ్లిన తర్వాత, వైసీపీ ప్రభుత్వం రంగా జ్ఞాపకాలను పక్కన పెట్టేసిందనే విమర్శలు ఉన్నాయి. కనీసం అధికారికంగా కూడా ఆయన పేరును పెద్దగా తలచుకోలేదు. అలాంటిది ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో జగన్ స్వయంగా ట్వీట్ చేయడం ద్వారా రంగా అభిమానులను, ముఖ్యంగా కాపు సామాజిక వర్గాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది.
మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. రంగా కుమార్తె వంగవీటి ఆశా కిరణ్ ఇప్పుడు రాజకీయంగా యాక్టివ్ అవుతున్నారు. ఆమె త్వరలోనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారని ప్రచారం జరుగుతోంది. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ.. రాధా-రంగా మిత్రమండలి సలహాల మేరకు తన భవిష్యత్ నిర్ణయం ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. ఈ తరుణంలో జగన్ చేసిన ట్వీట్.. ఆశా కిరణ్‌ను వైసీపీ వైపు ఆహ్వానించే ప్రయత్నమా? లేక రంగా మద్దతుదారుల సానుభూతిని తిరిగి సంపాదించుకునే ఎత్తుగడనా? అనే సందేహాలు మొదలయ్యాయి.
మొత్తానికి, వంగవీటి రంగా వర్ధంతిని పురస్కరించుకుని జగన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు తెరలేపుతున్నాయి. రాబోయే రోజుల్లో వంగవీటి కుటుంబం నుంచి ఆశా కిరణ్ వైసీపీ గూటికి చేరుతారా? లేదా జగన్ చేసిన ఈ నివాళి కేవలం సాధారణ రాజకీయ ప్రక్రియగానే మిగిలిపోతుందా? అన్నది వేచి చూడాలి. ఏది ఏమైనా, విజయవాడ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే రంగా పేరు ఇప్పుడు మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది.
