H-1B Visa

H-1B Visa: ట్రంప్ సర్కార్ కీలక నిర్ణయం: హెచ్‌–1బీ వీసాల ఎంపికలో కొత్త నిబంధనలు

H-1B Visa: అమెరికా ప్రభుత్వం హెచ్‌–1బీ వీసాల జారీ విధానంలో కీలకమైన మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు అమలులో ఉన్న ర్యాండమ్ లాటరీ విధానాన్ని పూర్తిగా తొలగించి, నైపుణ్యం ఎక్కువగా ఉన్నవారు, అధిక వేతనం పొందే విదేశీ కార్మికులకు ప్రాధాన్యం ఇచ్చే కొత్త వ్యవస్థను తీసుకురానుంది. ఈ విషయాన్ని అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారికంగా ప్రకటించింది.

కొత్త నిబంధనలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 27 నుంచి అమల్లోకి రానున్నాయి. 2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన హెచ్‌–1బీ క్యాప్ రిజిస్ట్రేషన్ సీజన్‌కు ఈ మార్పులు వర్తించనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. అమెరికా కార్మికుల ఉద్యోగ అవకాశాలు, పని పరిస్థితులు, వేతనాలను రక్షించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నామని హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం వెల్లడించింది.

ప్రస్తుతం అమలులో ఉన్న లాటరీ విధానాన్ని కొంతమంది సంస్థలు దుర్వినియోగం చేస్తున్నాయని అమెరికా ప్రభుత్వం భావిస్తోంది. తక్కువ వేతనాలతో విదేశాల నుంచి ఉద్యోగులను తీసుకువచ్చి, స్థానిక కార్మికులకు అవకాశాలు లేకుండా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే హెచ్‌–1బీ వీసాల ఎంపికలో వేతనం, నైపుణ్యాన్ని ప్రధాన ప్రమాణాలుగా మార్చాలని నిర్ణయించినట్లు తెలిపింది.

Also Read: ISRO: ఇస్రో మరో ఘనత.. శ్రీహరికోటలో LVM3-M6 రాకెట్‌ ప్రయోగం విజయవంతం

డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత వాణిజ్య విధానాలతో పాటు వీసా వ్యవస్థపైనా కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న హెచ్‌–1బీ లాటరీ వ్యవస్థను రద్దు చేయడం ఈ మార్పుల్లో కీలకమైనదిగా చెప్పవచ్చు. కొత్త విధానం ప్రకారం యజమానులు సూచించే అధిక వేతనాల ఆధారంగా వీసాల కేటాయింపు జరుగుతుంది. అంతేకాదు, ప్రతి ఏడాది ఇచ్చే 85 వేల హెచ్‌–1బీ వీసాల సంఖ్యను 65 వేల వరకు పరిమితం చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఈ మార్పులు వీసాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఉపయోగపడతాయని అధికారులు చెబుతున్నారు.

అయితే ఈ నిర్ణయం భారతీయులపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు లాటరీ విధానంపై ఆధారపడి హెచ్‌–1బీ వీసాలు పొందుతున్న అనేక మంది భారతీయ ఐటీ నిపుణులకు ఇప్పుడు పోటీ మరింత పెరిగే పరిస్థితి కనిపిస్తోంది. అధిక వేతనం, ప్రత్యేక నైపుణ్యం ఉన్నవారికే అవకాశాలు దక్కేలా కొత్త వ్యవస్థ రూపుదిద్దుకోనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *