Hyderabad Metro

Hyderabad Metro: ఎల్‌అండ్‌టీ నుంచి స్వాధీనం.. సరికొత్త కార్పొరేషన్‌కు రేవంత్ శ్రీకారం!

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో రైలు ప్రస్థానంలో ఒక శకం ముగియబోతోంది. పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం (PPP) నుంచి మెట్రోను విడదీసి, పూర్తిస్థాయిలో ప్రభుత్వ సంస్థగా మార్చేందుకు తెలంగాణ సర్కార్ గట్టి అడుగులు వేస్తోంది. ప్రైవేట్ దిగ్గజం ఎల్‌అండ్‌టీ (L&T) చేతుల నుంచి మెట్రో పగ్గాలను ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకోబోతుండటం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

ఎల్‌అండ్‌టీ ఎందుకు వెనక్కి తగ్గింది?

మెట్రో ప్రాజెక్టు లాభదాయకంగా మారుతుందని ఆశించిన ఎల్‌అండ్‌టీకి, కాలక్రమేణా నిర్వహణ భారం పెరిగింది. ప్రయాణికుల రద్దీ పెరిగినా, ఆశించిన స్థాయిలో ఆదాయం రాకపోవడం.. అప్పులపై వడ్డీల భారం పెరగడంతో మెట్రో నుంచి తప్పుకుంటామని ఆ సంస్థ గతంలోనే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. దీనిపై సానుకూలంగా స్పందించిన రేవంత్ సర్కార్, ప్రభుత్వమే నేరుగా మెట్రోను నడపాలని నిర్ణయించింది.

‘హైదరాబాద్ మెట్రో కార్పొరేషన్’ – కీలక ఫీచర్లు:

ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే ఈ నూతన కార్పొరేషన్ కేవలం నిర్వహణకే పరిమితం కాదు, దీనికి స్వయం ప్రతిపత్తి (Autonomy) కల్పించనున్నారు. టీఎస్‌ఆర్టీసీ తరహాలో మెట్రోకు కూడా ఒక ప్రత్యేక ఐడెంటిటీ ఉంటుంది.

ఇది కూడా చదవండి: Revanth Reddy: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయాలు: 29 నుంచి అసెంబ్లీ.. GHMC విస్తరణపై భారీ స్కెచ్!

ఢిల్లీ మెట్రో తరహాలో అంతర్జాతీయ సంస్థల నుంచి రుణాలు తీసుకోవడం, కేంద్ర రాష్ట్రాల నిధులను సమన్వయం చేయడం ఈ కార్పొరేషన్ బాధ్యత. మెట్రో కార్యకలాపాల కోసం ప్రత్యేకంగా సిబ్బందిని ఈ సంస్థే నియమించుకుంటుంది.

యాక్షన్ ప్లాన్ సిద్ధం.. ఫిబ్రవరిలో కీలక అడుగు!

మెట్రోను స్వాధీనం చేసుకునే ప్రక్రియను ప్రభుత్వం అత్యంత వేగంగా పూర్తి చేస్తోంది. ఇందుకోసం ఇప్పటికే కీలక ఏజెన్సీలను రంగంలోకి దింపింది:

ఐడీబీఐ (IDBI) కన్సల్టెన్సీ: ఎల్‌అండ్‌టీ వద్ద ఉన్న భూములు, ఆస్తులు, లీగల్ అంశాలను పరిశీలించి నివేదిక ఇస్తుంది.

టెక్నికల్ అసెస్‌మెంట్: మెట్రో రైళ్లు, ట్రాక్‌లు, సిగ్నలింగ్ వ్యవస్థల నాణ్యతను పరీక్షించేందుకు మరో సాంకేతిక సంస్థను నియమించనున్నారు.

డెడ్‌లైన్: 2026 ఫిబ్రవరి నాటికి ప్రక్రియ అంతా ముగించి, మార్చి నుంచి పూర్తిస్థాయిలో ప్రభుత్వ కార్పొరేషన్ పగ్గాలు చేపట్టనుంది.

400 కి.మీ మెట్రో.. భాగ్యనగరానికి సరికొత్త రూపు

రెండో దశలో భాగంగా 400 కిలోమీటర్ల మేర మెట్రోను విస్తరించడం ద్వారా నగరంలోని ప్రతి మూలకు కనెక్టివిటీ కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే 8 కారిడార్లకు సంబంధించిన డీపీఆర్ కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50:50 భాగస్వామ్యంతో ఈ భారీ ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *