Rachakonda

Rachakonda: రాచకొండలో పెరిగిన క్రైమ్ రేటు.. వార్షిక నివేదికలో షాకింగ్ నిజాలు!

Rachakonda: రాచకొండ కమిషనరేట్ పరిధిలో గడిచిన ఏడాది కాలంలో నేరాలు గణనీయంగా పెరిగాయి. గతేడాది 28,626 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది ఆ సంఖ్య 33,040కి చేరింది. అంటే నేరాల నమోదులో స్పష్టమైన పెరుగుదల కనిపిస్తోంది. ముఖ్యంగా మహిళలపై జరిగే అఘాయిత్యాలు గతంతో పోలిస్తే 4 శాతం పెరగడం ఆందోళన కలిగించే అంశం. మొత్తం కేసుల్లో సుమారు 21,056 కేసులు పరిష్కరించామని, నేరస్థులకు శిక్షలు పడేలా చేయడంలో పోలీసులు సఫలమయ్యారని సీపీ సుధీర్ బాబు వివరించారు.

సైబర్ నేరగాళ్ల గుట్టురట్టు.. బాధితులకు ఊరట ప్రస్తుత కాలంలో పెద్ద సవాలుగా మారిన సైబర్ నేరాల విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించారు. ఈ ఏడాది మొత్తం 3,734 సైబర్ కేసులు నమోదు కాగా, ఏకంగా 6,188 మంది నేరగాళ్లను కటకటాల వెనక్కి నెట్టారు. కేవలం అరెస్టులే కాకుండా, మోసపోయిన బాధితులకు సుమారు రూ.40.10 కోట్లను తిరిగి ఇప్పించడం గమనార్హం. టెక్నాలజీని వాడుకుని మోసాలకు పాల్పడే వారిపై నిఘా మరింత పెంచామని పోలీసులు స్పష్టం చేశారు.

డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం మత్తు పదార్థాల రవాణాను అరికట్టడంలో రాచకొండ పోలీసులు కీలక పురోగతి సాధించారు. సుమారు 20 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుని, 495 మందిని అరెస్టు చేశారు. ఇందులో మన రాష్ట్రానికి చెందిన వారితో పాటు ఇతర రాష్ట్రాల వారు, ఒక విదేశీయుడు కూడా ఉన్నట్లు తేలింది. డ్రగ్స్ కేసుల్లో పట్టుబడిన 227 మందిపై అనుమానిత షీట్లను తెరిచి, నిరంతరం నిఘా ఉంచుతున్నారు.

నేరాల వివరాలు ఒక్కసారి చూస్తే.. కమిషనరేట్ పరిధిలో నమోదైన ఇతర ప్రధాన నేరాలను గమనిస్తే.. 73 హత్యలు, 330 అత్యాచార కేసులు నమోదయ్యాయి. అలాగే 1,224 పోక్సో కేసులు, 579 కిడ్నాప్ కేసులు నమోదవ్వడం పరిస్థితి తీవ్రతను చూపుతోంది. దొంగతనాల విషయానికొస్తే 876 వాహనాల చోరీలు, 589 ఇళ్లలో దొంగతనాలు జరిగాయి. నేరస్థులకు కఠిన శిక్షలు పడేలా చేయడంలో భాగంగా అడ్డగూడూరు హత్య కేసులో 17 మందికి జీవిత ఖైదు పడేలా దర్యాప్తు చేశామని సీపీ సుధీర్ బాబు ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *