Khammam

Khammam: ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

Khammam: ఖమ్మం జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. తిరుమలాయపాలెం మండలం చంద్రతండా సమీపంలో ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ క్లీనర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, బస్సులో ప్రయాణిస్తున్న 36 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.

ప్రమాద వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం నుండి వరంగల్ వైపు వెళ్తున్న ఒక లారీలో సాంకేతిక లోపం తలెత్తి మధ్యలోనే నిలిచిపోయింది. దీంతో డ్రైవర్ లారీని రోడ్డు పక్కన ఆపాడు. అదే సమయంలో ఖమ్మం నుంచి బోధన్ వైపు వెళ్తున్న ఆర్టీసీ సూపర్‌ లగ్జరీ బస్సు వేగంగా వచ్చి నిలిపి ఉంచిన ఆ లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఆ సమయంలో లారీ కింద రిపేర్ పనులు చూస్తున్న క్లీనర్ నితీశ్‌పై బస్సు దూసుకుపోవడంతో అతను అక్కడికక్కడే మరణించాడు.

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై జగదీశ్ తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీసి, గాయపడిన 36 మందిని చికిత్స నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చీకటిగా ఉండటం వల్లే ఆగి ఉన్న లారీని బస్సు డ్రైవర్ గమనించలేకపోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *