Tiruvallur: బీమా సొమ్ము కోసం కన్న తండ్రినే కాలయముడికి అప్పగించిన ఇద్దరు కుమారుల ఘాతుకం తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో వెలుగుచూసింది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన యువకులు, ఆ అప్పులను తీర్చుకోవడానికి ఏకంగా తండ్రి ప్రాణాలనే పణంగా పెట్టిన తీరు సభ్య సమాజాన్ని విస్మయానికి గురిచేస్తోంది. తిరుత్తని సమీపంలోని పొదట్టూర్‌పెట్టయ్‌కు చెందిన గణేశన్ అనే ప్రభుత్వ పాఠశాల ల్యాబ్ అసిస్టెంట్ పాము కాటుకు గురై మరణించారు. అయితే, ఇది ప్రమాదవశాత్తు జరిగిన మరణం కాదని, కుమారులే పకడ్బందీగా వేసిన హత్యాకాండ అని పోలీసుల దర్యాప్తులో తేలింది.
గణేశన్ కుమారులు మోహన్‌రాజ్, హరిహరన్ ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు అలవాటు పడి భారీగా డబ్బు నష్టపోయారు. ఈ క్రమంలో తండ్రి పేరు మీద సుమారు మూడు కోట్ల రూపాయల విలువైన బీమా పాలసీలు చేయించి, ఆ డబ్బును కాజేయాలని ప్లాన్ చేశారు. ఇందుకోసం వారు తమ స్నేహితుల సహాయంతో అత్యంత విషపూరితమైన పాములను సేకరించారు. మొదటిసారి తండ్రి నిద్రిస్తున్న సమయంలో నాగుపాముతో కాలుపై కాటు వేయించారు, కానీ అప్పట్లో గణేశన్ ఆస్పత్రిలో చికిత్స పొంది ప్రాణాలతో బయటపడ్డారు. అయినప్పటికీ కుమారులు తమ పంతం వదలలేదు. వారం రోజుల వ్యవధిలోనే మరో విషపూరితమైన కట్లపామును తీసుకొచ్చి, ఆయన నిద్రిస్తున్నప్పుడు మెడపై కాటు వేయించి ప్రాణం తీశారు.
Also Read: Andhra Pradesh: ఏపీలో మరో కొత్త స్కీం అమలుకు శ్రీకారం
తండ్రి మరణించిన వెంటనే నిందితులు ఇన్సూరెన్స్ కంపెనీని ఆశ్రయించి క్లెయిమ్ కోసం ప్రయత్నించారు. అయితే, గణేశన్ ఆర్థిక స్థితికి మించి అధిక విలువ కలిగిన పాలసీలు ఉండటం, ఆయన చనిపోయిన కొద్దిరోజులకే కుమారులు డబ్బు కోసం పట్టుబట్టడంతో బీమా అధికారులకు అనుమానం కలిగింది. వారి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టగా, కుమారులు తమ నేరాన్ని అంగీకరించారు. తండ్రిని ఆస్పత్రికి తీసుకెళ్లడంలో కావాలనే ఆలస్యం చేశామని, పాముకాటును సహజ ప్రమాదంగా నమ్మించేందుకు ప్రయత్నించామని వారు వెల్లడించారు. ఈ కేసులో ఇద్దరు కుమారులతో పాటు వారికి సహకరించిన మరో నలుగురిని పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు.
