KTR: తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఘాటు విమర్శలు చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ఎవరితో ఫుట్‌బాల్ ఆడుకుంటారో తనకు తెలియదని, కానీ తాను మాత్రం రేవంత్‌తోనే ఫుట్‌బాల్ ఆడుకుంటానని కేటీఆర్ సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డిలాగా తాను కుటుంబ సభ్యులపై, మహిళలపై లేదా చిన్న పిల్లలపై చిల్లర రాజకీయాలు చేయనని, వ్యక్తిగత విమర్శలకు తాను దూరమని స్పష్టం చేశారు.
రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతోందో కేటీఆర్ వివరించారు. కేసీఆర్ త్వరలోనే ప్రజల్లోకి వస్తారని, రేపు జరగబోయే కీలక సమావేశంలో బహిరంగ సభలు మరియు భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. రేవంత్ సర్కార్‌కు ఉన్న ‘హనీమూన్ పీరియడ్’ ముగిసిందని, ఇక నుంచి ప్రజల తరపున పోరాటం ఉధృతం చేస్తామని చెప్పారు. లోకల్ బాడీ ఎన్నికల తర్వాత పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా ఉంటుందని వెల్లడించారు.
తన నాయకత్వంపై వస్తున్న విమర్శలకు కేటీఆర్ గట్టిగానే సమాధానమిచ్చారు. తాను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఫెయిల్ అయ్యానన్న మాటల్లో నిజం లేదన్నారు. తన హయాంలోనే 32 జిల్లా పరిషత్‌లు, 136 మున్సిపాలిటీలను గెలుచుకున్నామని గుర్తు చేశారు. అదే సమయంలో రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జరిగిన 7 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణంగా ఓడిపోయిందని, చివరకు సీఎం అయ్యాక తన సొంత పార్లమెంట్ స్థానాన్ని కూడా గెలిపించుకోలేకపోయారని ఎద్దేవా చేశారు.
చివరగా రేవంత్ రెడ్డికి, బీజేపీకి ఉన్న సంబంధాల గురించి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో రేవంత్ రెడ్డి ఉంటున్న ఇంటిని రీమోడల్ చేయించింది ఒక బీజేపీ ఎంపీ అని, అలాగే సీఎం రమేష్ వంటి వారికి కాంట్రాక్టులు ఇస్తున్నది కూడా రేవంత్ రెడ్డియే అని ఆరోపించారు. రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీలే అసలైన ‘ఐరన్ లెగ్’లని మండిపడ్డారు. ఢిల్లీలో రేవంత్ ఎవరి ఇళ్లలో విందులు చేస్తున్నారో తమకు అన్నీ తెలుసని కేటీఆర్ హెచ్చరించారు.
