Manchi Manishi: నటరత్న యన్టీఆర్ చిత్రాల్లో పలు కథలు ఒకే పోలికతో కనిపిస్తూంటాయి… అలాంటి చిత్రమే అరవై ఏళ్ళ క్రితం వచ్చిన ‘మంచి మనిషి’… ఈ సినిమాకు యన్టీఆర్ ‘ఇంటిగుట్టు’కు కథనంలో తేడా ఉన్నా, ప్రధానాంశం మాత్రం చాలా దగ్గర పోలికతో ఉంటుంది… ‘మంచి మనిషి’ ఆరు పదుల క్రితం ఎలా సాగిందో చూద్దాం…
Manchi Manishi: పొత్తిళ్ళలో పసికందులను మార్చేయడం అన్న అంశాన్ని తెరపై చూసినప్పుడు చప్పున యన్టీఆర్ నటించిన ‘ఇంటిగుట్టు’, ‘మంచి మనిషి’ చిత్రాలే గుర్తుకు వస్తాయి… చివరిదాకా ఆ మారిపోయిన వారి చుట్టూనే కథ సాగుతూ ఉంటుంది… పతాక సన్నివేశాలకు ముందుగా ఎవరు ఎవరో తెలుస్తుంది… అలా ‘ఇంటిగుట్టు’, ‘మంచిమనిషి’ సినిమాలు అలరించాయి…. ‘ఇంటిగుట్టు’లో ఆస్తికోసం తన భార్య అన్న కొడుకు స్థానంలో తన అబ్బాయిని పెడతాడు ఓ మోసగాడు… ఆ తరువాత కథ పలు మలుపులు తిరిగి చివరకు అసలు వారసుడు ఎవరో తెలుస్తుంది… ఈ చిత్ర కథాంశాన్ని పోలినట్టుగానే ఆ మధ్య త్రివిక్రమ్ ‘అల…వైకుంఠపురములో’ తెరకెక్కించి ఘనవిజయం సాధించారు… ఇక ‘ఇంటిగుట్టు’ కూడా 1958లో బ్లాక్ బస్టర్ గా నిలచింది… ‘ఇంటిగుట్టు’ విడుదలైన ఆరేళ్ళకు ‘మంచిమనిషి’ విడుదలయింది… ఇందులో ‘దొంగ కొడుకు దొంగే అవుతాడు’ అని ఓ నిర్దోషికి శిక్షపడేలా చేస్తాడు ఓ న్యాయవాది… దాంతో ఆ న్యాయవాది కొడుకును పొత్తిళ్ళలోనే ఎత్తుకుపోయి, ఆ బాబు స్థానంలో తన బిడ్డను పెడతాడు ఆ దొంగ… తరువాత దొంగ వద్ద పెరిగిన వాడు దొంగవుతాడు, న్యాయమూర్తి చెంతన చేరినవాడు న్యాయవాది అనిపించుకుంటాడు… ఈ కథలో కొన్ని ట్విస్టుల సాగాక చివరకు ఎవరు ఎవరో తెలిసి కథ సుఖాంతమవుతుంది… 1964 నవంబర్ 11న విడుదలైన ‘మంచి మనిషి’ ఆ రోజుల్లో మంచి ఆదరణ చూరగొంది…
Manchi Manishi: ‘మంచి మనిషి’ కథ విషయానికి వస్తే – గుమ్మడి న్యాయవాది, ఓ కేసులో మిక్కిలినేని దొంగతనం చేశాడని వాదిస్తాడు గుమ్మడి…అప్పుడు అతని తండ్రి కూడా దొంగే కాబట్టి, దొంగ కడుపున దొంగే పుడతాడని, అందువల్ల దొంగతనం అతడే చేశాడని కోర్టును నమ్మిస్తాడు. – మిక్కిలినేనికి శిక్ష పడేలా చేస్తాడు…. దాంతో పగబట్టిన మిక్కిలినేని, ఆసుపత్రిలో ప్రసవించిన గుమ్మడి భార్య చెంతన తన కొడుకును పడుకోబెట్టి, అతని కొడుకును తీసుకువెళతాడు… అదే పనిగా న్యాయమూర్తి కొడుకును దొంగగా మారుస్తాడు మిక్కిలినేని… విధి విచిత్రంగా గుమ్మడి కోడలు జమునను, దొంగగా మారిన న్యాయమూర్తి కొడుకు యన్టీఆర్ ను కలుపుతుంది… వారి ప్రేమకు గుమ్మడి అడ్డు నిలవడం, తరువాత ఓ నర్సు ద్వారా మిక్కిలినేని పొత్తిళ్ళలోని పిల్లలను మార్చేశాడని తెలుస్తుంది… అప్పటికి జడ్జిగా ఉన్న గుమ్మడికి ఆయన భార్య ఈ విషయం తెలిసి చెప్పినా అంగీకరించడు… పైగా తన వద్ద పెరిగిన జగ్గయ్యకు, తన కోడలు జమునకు పెళ్ళి చేయాలనీ చూస్తాడు… అయితే అసలు విషయాలు తెలిశాక చివరకు ప్రేమించుకున్న యన్టీఆర్, జమున పెళ్ళి చేసుకోవడంతో కథ సుఖాంతమవుతుంది…
Manchi Manishi: ‘మంచి మనిషి’లో జగ్గయ్య, గుమ్మడి, మిక్కిలినేని, పద్మనాభం, గీతాంజలి, హేమలత ముఖ్యపాత్రధారులు… యన్టీఆర్ తో కె.ప్రత్యగాత్మ దర్శకత్వంలో రూపొందిన తొలి చిత్రం ‘మంచి మనిషి’… ఈ మూవీని ఛాయా చిత్ర పతాకంపై కె.సుబ్బరాజు నిర్మించారు… ఈ చిత్రానికి కథ, మాటలు పినిశెట్టి సమకూర్చారు… ఈ సినిమాకు యస్.రాజేశ్వరరావుతో కలసి టి.చలపతిరావు సంగీతం రూపొందించడం విశేషం!…. కొసరాజు, శ్రీశ్రీ, దాశరథి, సి.నారాయణరెడ్డి పాటలు పలికించారు… ఇందులో రెజ్లింగ్ కింగ్ అనిపించుకున్న అజిత్ సింగ్ ఓ సీన్ లో నటించారు… కుస్తీ పోటీల్లో అజిత్ సింగ్ ను యన్టీఆర్ చిత్తు చేయడం ఆ సన్నివేశం!… అప్పట్లో పబ్లిసిటీలోనూ యన్టీఆర్-అజిత్ సింగ్ రెజ్లింగ్ పోటీ అంటూ ప్రత్యేకంగా ప్రచారం చేశారు… 1964లో యన్టీఆర్ హిట్ మూవీస్ లో ఒకటిగా ‘మంచి మనిషి’ నిలచింది…
Manchi Manishi: ‘మంచి మనిషి’ ఆ రోజుల్లో మ్యూజికల్ హిట్ అనిపించుకుంది… ఈ సినిమాలో ఎన్ని పాటలు ఉన్నా, పి.బి.శ్రీనివాస్ పాడిన ‘ఓహో గులాబి బాలా…’ సాంగ్ విశేషాదరణ చూరగొంది… పి.బి.శ్రీనివాస్ కు కూడా ఎంతో ఇష్టమైన పాట ఇది… సినిమాలో సందర్భానుసారంగా జగ్గయ్య నోట ఈ పాట సాగుతుంది… అయితే ఆ పాటలో యన్టీఆర్, జమున, గుమ్మడి, హేమలత వంటి ప్రధాన పాత్రధారులు కూడా కనిపిస్తారు… ఈ పాట తరువాతే కథ మలుపు తిరగడం విశేషం!… ఏది ఏమైనా ‘మంచి మనిషి’ కథాంశంతో ఆ తరువాత కూడా పలు చిత్రాలు వెలుగు చూశాయి… రిపీట్ రన్స్ లోనూ ‘మంచి మనిషి’ వసూళ్ళ వర్షం కురిపించింది…