ys sharmila: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్‌పై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆరోపణలు చేశారు. తాను చేసిన ఫోన్‌ను ట్యాప్ చేశారన్నది దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. ఈ వ్యవహారంపై బాధ్యత వహించాల్సినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో మాట్లాడిన షర్మిల, “ఒక మహిళగా కూడా చూడకుండా, రాజకీయ ప్రత్యర్థిని అణచివేయడానికే ఈ చర్యలకు పాల్పడ్డారు,” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యక్తిగత సంభాషణలను విచ్చలవిడిగా విని, దానిని రాజకీయ ప్రయోజనాలకు వాడుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తెలంగాణలో, జగన్ ప్రభుత్వ కాలంలో ఏపీలో ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు ఆమె ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని, వ్యక్తిగత గోప్యతకు పెద్ద దెబ్బ అని చెప్పారు. అధికార దుర్వినియోగానికి ఇది ఉదాహరణ అని విమర్శించారు. వైవీ సుబ్బారెడ్డి ఫోన్ ట్యాపింగ్‌ను ధ్రువీకరించినట్లు, ఓ ఆడియోను తనకు వినిపించారని షర్మిల తెలిపారు. కేసీఆర్ కోసం జగన్ ఈ కుట్రలో భాగమైనారని ఆరోపించారు. విచారణకు ఎప్పుడైనా హాజరవుతానని, నిజాలు బయటకురావాలంటే సమగ్ర దర్యాప్తు జరపాలని కోరారు.
రాష్ట్ర ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఈ వ్యవహారంపై తక్షణ విచారణ చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రజల గోప్యతను పరిరక్షించడం ప్రభుత్వాల బాధ్యత అని స్పష్టం చేశారు.