Ap news: వైసీపీ పార్టీకి వరుస షాకులు తగులుతున్నయి. రోజుకో నేత పార్టీ మారుతూ క్యాడర్ కి గుబులు పట్టిస్తున్నారు. తాజాగా ప్రముఖ పారిశ్రామికవేత్త, వైసీపీ ప్రభుత్వంలో సలహాదారుగా పనిచేసిన ఎస్.రాజీవ్ కృష్ణ మంత్రి నారా లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరారు.రెండు రోజుల క్రితం ఆయన వైసీపీకి రాజీనామా చేశారు. 2014 ఎన్నికల్లో నిడదవోలు నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. కూటమి ప్రభుత్వ సమర్థ పాలనలో భాగస్వామ్యమయ్యేందుకు పలువురు వైసీపీ నేతలు టీడీపీలో చేరుతున్నారు.
ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ.. నేనే రాజు, నేనే మంత్రి అని అనుకోకూడదని, టీడీపీ క్రమశిక్షణ గల పార్టీ అని పేర్కొన్నారు. నేతలు స్థానికంగా అందరినీ సమన్వయం చేసుకుని పనిచేయాలని సూచించారు. అందరం కలిసికట్టుగా రాష్ట్రాభివృద్ధికి కృషిచేద్దామని పిలుపునిచ్చారు. రాజీవ్ కృష్ణ భవిష్యత్‌ను తాను చూసుకుంటానని హామీ ఇచ్చారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి సముచిత గౌరవం కల్పిస్తామని, ప్రజల మెప్పు పొందాలని పేర్కొన్నారు.బూతులకు, అసభ్యకర పోస్టులకు వైసీపీ ఒక మోడల్ అని ఎద్దేవా చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలతో ఆ పార్టీ 11 స్థానాలకు పడిపోయిందని విమర్శించారు. భాష ప్రధానమని, ప్రజలు మనపై పవిత్ర బాధ్యత పెట్టారని, అసెంబ్లీలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు లేకపోయినా ప్రజాసమస్యల పరిష్కారమే ఏకైక అజెండాగా పనిచేస్తున్నామని చెప్పారు.
రాజీవ్ కృష్ణ మాట్లాడుతూ.. పార్టీకి ఆస్తిగా మారతామని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తూ వారికి అన్ని విధాల అండగా నిలుస్తామన్నారు తెలిపారు.అందరినీ సమన్వయం చేసుకుంటూ పనిచేస్తామని చెప్పారు.