Sivaji: సినీ నటుడు శివాజీ ఇటీవల మహిళల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపిన నేపథ్యంలో, ఆయన శనివారం తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు. సికింద్రాబాద్లోని బుద్ధ భవన్లో ఉన్న కమిషన్ కార్యాలయానికి చేరుకున్న ఆయన, తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. ‘దండోరా’ సినిమా వేడుకలో ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ కావడమే కాకుండా, మహిళా లోకం నుంచి తీవ్ర వ్యతిరేకతకు దారితీశాయి. ఈ విషయాన్ని మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించి నోటీసులు జారీ చేయడంతో, శివాజీ నేడు అధికారుల ఎదుట హాజరయ్యారు.
ఈ విచారణ సందర్భంగా శివాజీ తన ప్రసంగంలో దొర్లిన కొన్ని అభ్యంతరకర పదాల పట్ల విచారం వ్యక్తం చేశారు. తన సుదీర్ఘ సినీ కెరీర్లో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ ఎదురుకాలేదని పేర్కొంటూ, మహిళలందరికీ మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పారు. అయితే, తాను వాడిన భాష తప్పని ఒప్పుకుంటూనే, ఆనాడు తాను చెప్పదలచుకున్న ప్రధాన అంశానికి మాత్రం కట్టుబడి ఉన్నానని స్పష్టం చేయడం గమనార్హం. కేవలం రెండు పదాల విషయంలోనే పొరపాటు జరిగిందని, తన ఉద్దేశం ఎవరినీ కించపరచడం కాదని ఆయన కమిషన్కు వివరించినట్లు తెలుస్తోంది.
Also Read: Varanasi: మహేష్ బాబు ఐదు పాత్రల్లో కనిపిస్తారా?
ఈ వివాదం టాలీవుడ్లో భిన్నాభిప్రాయాలకు దారితీసింది. గాయని చిన్మయి, నటి అనసూయ వంటి వారు శివాజీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. మహిళల వస్త్రధారణ వారి వ్యక్తిగత హక్కు అని, దానిపై సలహాలు ఇచ్చే అధికారం ఎవరికీ లేదని వారు వాదించారు. మరోవైపు, కరాటే కళ్యాణి వంటి కొందరు మాత్రం శివాజీ వాడిన భాష సరిగా లేకపోయినా, ఆయన చెప్పిన సందేశం మంచిదేనంటూ మద్దతుగా నిలిచారు. చిత్రమేమిటంటే, ఈ వివాదం ఇంతగా ముదిరినా తెలుగు రాష్ట్రాల్లో ఆయనపై అధికారికంగా ఎలాంటి పోలీస్ కేసులు నమోదు కాలేదు. ప్రస్తుతం మహిళా కమిషన్ ఈ విచారణను ఎలా ముగిస్తుందనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
