Anakapalli

Anakapalli: కాసుల కక్కుర్తి.. పెద్దమ్మను హతమార్చిన కిరాతకురాలు!

Anakapalli: అనకాపల్లి జిల్లా కశింకోటలో ఒక దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. కేవలం కొంత బంగారం కోసం, సొంత పెద్దమ్మ అని కూడా చూడకుండా ఒక మహిళ వృద్ధురాలిని ప్రాణాలతో తీసేసింది. నమ్మి ఇంట్లోకి రానిచ్చిన పెద్దమ్మను అత్యంత కిరాతకంగా చంపేసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కశింకోటలో దమ్ము నాగమ్మ (85) అనే వృద్ధురాలు ఒంటరిగా నివసిస్తోంది. ఈ నెల 16వ తేదీన ఆమె అనుమానాస్పద స్థితిలో మరణించింది. దీనిపై సమాచారం అందుకున్న సీఐ స్వామినాయుడు ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వృద్ధురాలి మరణం వెనుక ఉన్న అసలు రహస్యాన్ని ఛేదించేందుకు రంగంలోకి దిగారు.

పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. నాగమ్మ సోదరి కుమార్తె సిమ్మ సత్య అనే మహిళకు బయట అప్పులు ఎక్కువగా ఉన్నాయి. ఆ అప్పుల బాధల నుంచి ఎలాగైనా బయటపడాలని ఆమె ప్లాన్ వేసింది. ఒంటరిగా ఉంటున్న పెద్దమ్మ నాగమ్మ దగ్గర ఉన్న బంగారాన్ని ఎలాగైనా కొట్టేయాలని డిసైడ్ అయింది. ఈ క్రమంలోనే ఈ నెల 16న రాత్రి సత్య పెద్దమ్మ ఇంటికి వెళ్ళింది.

తనకున్న అప్పులు తీర్చుకోవడానికి బంగారు నగలు తాకట్టు పెట్టుకుంటానని, అవి ఇవ్వాలని పెద్దమ్మను అడిగింది. కానీ అందుకు నాగమ్మ నిరాకరించింది. దీంతో కోపంతో ఊగిపోయిన సత్య, వృద్ధురాలు అని కూడా చూడకుండా తన మెడలోని చున్నీతో నాగమ్మ గొంతు నులిమి దారుణంగా హత్య చేసింది. ఆ తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మరుసటి రోజు మళ్ళీ ఏమీ తెలియనట్టు నాగమ్మ ఇంటికి వచ్చి, ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను దొంగిలించింది.

మొదట్లో ఈ మరణంపై ఎవరికీ అనుమానం రాకుండా సత్య చాలా జాగ్రత్త పడింది. కానీ పోలీసులు తమదైన శైలిలో విచారణ జరపడంతో అసలు రంగు బయటపడింది. పోలీసుల నిలదీతతో తానే అప్పుల కోసం పెద్దమ్మను హత్య చేసినట్లు సత్య తప్పు ఒప్పుకుంది. దీంతో పోలీసులు నిందితురాలిని అరెస్ట్ చేసి, ఆమె దగ్గర నుంచి దొంగిలించిన బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. సొంత బంధువే ఇలా బంగారం కోసం ప్రాణాలు తీయడం అందరినీ భయాందోళనకు గురిచేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *