Telangana: పెండింగ్ బిల్లులపై తాజా మాజీ సర్పంచులు రగిలిపోతున్నారు. పదవీ కాలం ముగిసి ఏడాది కావస్తున్నా బిల్లులు అందక, అప్పులు చెల్లించే దారిలేక కొందరు పదవీకాలం ఉండగానే ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఆ తర్వాత ప్రభుత్వ జాప్యం కారణంగా కూడా మరికొందరు తనువులు చాలించారు. అయినా బిల్లులను మంజూరు చేయకపోవడంతో తాజా మాజీ సర్పంచులు మదన పడుతున్నారు.
Telangana: ఇప్పటికే వివిధ రూపాల్లో ఆందోళనలకు దిగారు. సీఎం, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సహా ఎందరో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులకు తమ గోడు వినిపించారు. అయినా ఎవరూ తమ పట్ల కనికరం చూపడం లేదని ఆవేదన చెందుతున్నారు. ప్రథమ పౌరులుగా సొంత నిధులతో పంచాయతీలను అభివృద్ధి చేస్తే.. మాకిచ్చే గౌరవం ఇదేనా? అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బిల్లులు చెల్లించకుంటే తమకు చావే గతి అని ఎందరో గగ్గోలు పెడుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.
Telangana: ఈ నెల 30లోగా సర్పంచుల బిల్లులు చెల్లించకుంటే, వచ్చే నెలలో ఆమరణ దీక్షలకు దిగుతామని సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గూడూరు లక్ష్మీనర్సింహారెడ్డి, ప్రధాన కార్యదర్శి ప్రణిల్ చందర్‌లు తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వ సూచన మేరకే గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని వారు తెలిపారు.