Supreme Court: ఒకే కుటుంబంలో తల్లిదండ్రులు ఇద్దరూ ఐఏఎస్ అధికారులుగా ఉండి, సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు వారి పిల్లలకు రిజర్వేషన్లు ఎందుకు కల్పించాలని సుప్రీంకోర్టు కీలక ప్రశ్నలు లేవనెత్తింది. విద్యాపరంగా, ఆర్థికంగా ఒక కుటుంబం మంచి స్థాయికి చేరుకున్నప్పుడు అది వారి సామాజిక ఎదుగుదలకు కారణమవుతుందని కోర్టు పేర్కొంది. అలాంటి పరిస్థితుల్లో మళ్లీ వారి పిల్లలు కూడా రిజర్వేషన్లు కోరడం ఎంతవరకు సమంజసమని జస్టిస్ నాగారాత్న అభిప్రాయపడ్డారు. ఈ తరహా అంశాలపై పునరాలోచన చేయాల్సిన అవసరం ఉందని కోర్టు వ్యాఖ్యానించింది.
రిజర్వేషన్ల ఫలాలు నిజమైన వెనుకబడిన వర్గాలకు, కిందిస్థాయిలో ఉన్న పేదలకు మాత్రమే అందాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సమాజంలో ఒకే కుటుంబం పదే పదే అన్ని అవకాశాలను దక్కించుకుంటే, అదే వర్గానికి చెందిన ఇతర వెనుకబడిన పేద ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని చాలా తీవ్రమైన అంశంగా పరిగణించాలని స్పష్టం చేస్తూ, దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
ఇదే సమయంలో ఓబీసీ (OBC) క్రీమిలేయర్‌కు, ఈడబ్ల్యూఎస్ (EWS) కోటాకు మధ్య ఉన్న తేడాలను జస్టిస్ నాగారాత్న ప్రస్తావించారు. ఈడబ్ల్యూఎస్ వర్గానికి సామాజికంగా ఎలాంటి వెనుకబాటుతనం ఉండదని, వారికి కేవలం ఆర్థికపరమైన ఇబ్బందులు మాత్రమే ఉంటాయని ఆమె వివరించారు. అందువల్ల, ఈడబ్ల్యూఎస్ వర్గంతో పోలిస్తే క్రీమీ లేయర్ వర్గానికి సంబంధించిన నిబంధనలు మరింత సరళంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. ఈ రెండు వర్గాలను ఒకేలా చూస్తే అసలు తేడానే ఉండదని కోర్టు స్పష్టం చేసింది.
