Acid Attacks: ఒక్క క్షణం ఆలోచించండి.. ఎంతో అందంగా, కలలతో నిండిన ఒకరి జీవితాన్ని, ముఖాన్ని కేవలం వంద రూపాయల లోపు దొరికే ఒక చిన్న సీసా యాసిడ్ శాశ్వతంగా మార్చేస్తుంది! మన దేశంలో ఎన్నో ఏళ్లుగా కఠినమైన చట్టాలు, సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ, యాసిడ్ దాడులనే రాక్షసత్వం ఇంకా ఆగడం లేదు. అసలు బాత్రూమ్ క్లీనింగ్ పేరుతో వీధి చివర ఉన్న కిరాణా కొట్టులో కూడా చాక్లెట్ దొరికినంత ఈజీగా యాసిడ్ ఎందుకు దొరుకుతోంది?
ఇదే విషయంపై తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. యాసిడ్ దాడి బాధితురాలు షాహీన్ మాలిక్ వేసిన పిటిషన్‌ను విచారిస్తూ, దేశంలో మళ్లీ యాసిడ్ దాడులు పెరగడం ముమ్మాటికీ “ప్రభుత్వ విధానాల వైఫల్యమే (Policy Failure)” అని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా (CJI) సూర్యకాంత్, జస్టిస్ జోయ్మల్యా బాగ్చీ, జస్టిస్ వి. మోహన్లతో కూడిన ధర్మాసనం కుండబద్దలు కొట్టింది.
అసలు లెక్కలు చూస్తే మన గుండె తరుక్కుపోతుంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) డేటా ప్రకారం.. కరోనా లాక్డౌన్ సమయంలో (2020లో 182, 2021లో 176) కాస్త తగ్గినట్లు కనిపించిన యాసిడ్ దాడులు, 2022 నుంచి మళ్లీ ఏటా 200 దాటిపోతున్నాయి (2022లో 202, 2023లో 207, 2024లో 207 కేసులు నమోదయ్యాయి). అంటే కరోనా సమయంలో బయట షాపులు మూతపడటం వల్ల మాత్రమే దాడులు తగ్గాయి తప్ప, మన వ్యవస్థలో మార్పు రాలేదని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
బాధితులు ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగాల్సి రావడం, ఆసుపత్రుల్లో సరైన సమయానికి ఉచిత వైద్యం అందకపోవడం, పరిహారం కోసం ఎదురుచూడాల్సి రావడంపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ.. ఇప్పటివరకు నిబంధనలు ఏ మేరకు అమలయ్యాయో నివేదిక ఇవ్వాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ఆదేశించింది.
నిజానికి, యాసిడ్ అమ్మకాలను కట్టడి చేయడానికి రూల్స్ లేవా అంటే.. చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి! 2013లో ‘లక్ష్మి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల తర్వాత కేంద్ర హోంశాఖ కఠిన నిబంధనలు తెచ్చింది. వాటి ప్రకారం, లైసెన్స్ లేకుండా ఎవరూ యాసిడ్ అమ్మకూడదు.. 18 ఏళ్లు నిండని పిల్లలకు అస్సలు ఇవ్వకూడదు; కొనేవాళ్ల ప్రభుత్వ గుర్తింపు కార్డు (ఆధార్ వంటివి) చెక్ చేసి, ఎందుకు కొంటున్నారు, ఎంత కొంటున్నారు అనే వివరాలు రిజిస్టర్లో రాసుకోవాలి. కానీ గ్రౌండ్ లెవల్లో ఏం జరుగుతోంది?
ఏ షాపులోనూ రిజిస్టర్లు ఉండవు, ఐడీ కార్డులు అడగరు! పైగా ఇప్పుడు ఆన్లైన్ ఈ-కామర్స్ సైట్లలోనూ యాసిడ్ విచ్చలవిడిగా దొరుకుతుండటంపై వినియోగదారుల రక్షణ ప్రాధికార సంస్థ (CCPA) హెచ్చరికలు జారీ చేయాల్సి వచ్చింది. “బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో కఠిన చట్టాలతో యాసిడ్ దాడులను అరికట్టినప్పుడు, మన దగ్గర ఎందుకు సాధ్యం కావడం లేదు? బాత్రూమ్ క్లీనింగ్ కోసం యాసిడ్ బదులు ఎన్నో సురక్షితమైన ప్రత్యామ్నాయాలు ఉన్నప్పుడు, అసలు రిటైల్ మార్కెట్లో యాసిడ్ అమ్మకాలు ఎందుకు?” అని జస్టిస్ జోయ్మల్యా బాగ్చీ సూటిగా ప్రశ్నించారు.
మరి ప్రభుత్వం రిటైల్ మార్కెట్లో యాసిడ్‌ను పూర్తిగా ఎందుకు నిషేధించడం లేదు అనే సందేహం రావచ్చు. హైడ్రోక్లోరిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్ వంటి వాటిని ఫ్యాక్టరీలలో వస్తువుల తయారీ, మెటల్ క్లీనింగ్, వాటర్ ట్రీట్మెంట్, బంగారు ఆభరణాల తయారీ వంటి పరిశ్రమల్లో తప్పనిసరిగా వాడాల్సి ఉంటుంది. పూర్తిగా బ్యాన్ చేస్తే ఆ పరిశ్రమలు ఆగిపోతాయనే ఉద్దేశంతో ప్రభుత్వం పూర్తి నిషేధం బదులు లైసెన్సింగ్ విధానాన్ని ఎంచుకుంది.
అయితే, పరిశ్రమలకు నేరుగా ప్రత్యేక ఛానెళ్ల ద్వారా యాసిడ్ అందిస్తూ, సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే రిటైల్ షాపుల్లో యాసిడ్ అమ్మకాలను పూర్తిగా నిషేధించాలని, అలాగే ప్రతి యాసిడ్ అమ్మకం వివరాలు ఆటోమేటిక్‌గా ప్రభుత్వ సెంట్రల్ సర్వర్‌కు వెళ్లేలా డిజిటల్ ట్రాకింగ్ పెట్టాలని సామాజిక కార్యకర్తలు, న్యాయ నిపుణులు డిమాండ్ చేస్తున్నారు.
ఇక చట్టపరంగా బాధితులకు ఉన్న హక్కుల విషయానికొస్తే.. భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 124 కింద యాసిడ్ దాడికి పాల్పడితే కనీసం పదేళ్ల నుంచి జీవితఖైదు వరకు శిక్ష పడుతుంది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్రతి బాధితురాలికి ప్రభుత్వం కనీసం రూ.3 లక్షల పరిహారం ఇవ్వాలి. అంతేకాకుండా, ప్రభుత్వ ఆసుపత్రులే కాకుండా ఏ ప్రైవేట్ ఆసుపత్రి అయినా సరే యాసిడ్ దాడి బాధితులకు ఉచితంగా ప్రథమ చికిత్స, పూర్తి వైద్యం అందించాల్సిందేనని కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశాలు ఉన్నాయి.
మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. దివ్యాంగుల హక్కుల చట్టం (RPWD Act, 2016) కింద యాసిడ్ దాడి బాధితులకు దివ్యాంగుల కోటాలో ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యలో రిజర్వేషన్లు లభిస్తాయి. ఈ ఏడాది ఆరంభంలో సుప్రీంకోర్టు మరో చారిత్రాత్మక తీర్పునిస్తూ.. బయటకు గాయాలు కనిపించకపోయినా, బలవంతంగా యాసిడ్ తాగించడం వల్ల లోపలి అవయవాలు దెబ్బతిన్న వారిని కూడా ‘యాసిడ్ దాడి బాధితులు’గానే గుర్తించాలని స్పష్టం చేసింది. చట్టాలు ఎన్ని ఉన్నా, వాటిని చిత్తశుద్ధితో అమలు చేసి, రిటైల్ మార్కెట్లో యాసిడ్ లభ్యతకు అడ్డుకట్ట వేసినప్పుడే ఇలాంటి ఘోరాలకు పూర్తిగా చెక్ పెట్టగలం.
